
Sania Mirza : టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు హైదరాబాద్ అంటే ప్రాణం. ఈసారి రంజాన్ పండుగను తన సొంత గడ్డపై, ఆత్మీయుల మధ్య జరుపుకోవడం ఆమెకు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. దుబాయ్‌లో నివసిస్తున్న సానియా, అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం, ఆందోళనల దృష్ట్యా తన కుమారుడు ఇజాన్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. పాతబస్తీ సందుల్లో తిరుగుతూ, గాజుల గలగలల మధ్య పెరిగిన తన చిన్ననాటి ఈద్ ముచ్చట్లను ఆమె తాజాగా నెమరువేసుకున్నారు. సానియా మీర్జా తన చిన్నతనంలో హైదరాబాద్ పాతబస్తీలో పండుగ ఎలా జరుపుకునేవారో గుర్తుచేసుకున్నారు. లాడ్ బజార్‌కెళ్లి మెరిసే గాజులు కొనడం, కొత్త బట్టలు వేసుకోవడం, కజిన్స్‌తో కలిసి హలీమ్ తినడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. పండుగ రోజు ఉదయాన్నే ప్రార్థనల తర్వాత అందంగా ముస్తాబై, తన ఆంటీ ఇంటికి వెళ్లి ఉమ్మడి కుటుంబంతో కలిసి లంచ్ చేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని వివరించారు. టెన్నిస్ కెరీర్ వల్ల చాలా ఏళ్లు ఈ పండుగకు దూరమయ్యానని, కానీ గత కొన్నేళ్లుగా కుటుంబంతో గడపడం సంతోషంగా ఉందని ఆమె ఎమోషనల్ అయ్యారు.
దుబాయ్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చింది?
ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న సానియా, అక్కడ నెలకొన్న భయానక పరిస్థితుల వల్ల ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా దుబాయ్ ఆకాశంలో ఫైటర్ జెట్ల శబ్దాలు వినిపిస్తున్నాయని, తమ ఇంటికి కొద్ది దూరంలోనే యుద్ధ విమానాల శిథిలాలు పడ్డాయని ఆమె వెల్లడించారు. తన కుమారుడు ఇజాన్ ఆ శబ్దాలకు భయపడి ప్రశ్నలు అడుగుతున్నాడని, అతడిని మానసిక ఆందోళన నుంచి రక్షించడానికే తాను హైదరాబాద్ వచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు.
కుటుంబంతో కలిసి సంబరాలు
సానియా మీర్జా తన సోషల్ మీడియాలో పండుగ ఫోటోలను షేర్ చేశారు. తన తల్లిదండ్రులు, సోదరి అనం మీర్జా, చిన్నారి మేనకోడలితో కలిసి ఆమె ఈద్ జరుపుకున్నారు. “ఈద్ అంటే కేవలం షీర్ ఖుర్మా తినడం మాత్రమే కాదు.. మనవైన విలువలను, ఆత్మీయతలను పంచుకోవడం” అని సానియా పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్‌గా తన బాధ్యతలను నెరవేరుస్తూనే, తన కొడుకుకు తన మూలాలను, సంస్కృతిని పరిచయం చేయడం తనకు సంతృప్తినిస్తుందని ఆమె చెప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..