వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిందని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రన్ పేర్కొన్నాడు. ఇదే జోరును త్వరలో జరగనున్న యాషెస్‌లోనూ కొనసాగించి అక్కడ కూడా విజయం సాధిస్తామన్నాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కర్రన్ మాట్లాడుతూ..‘ఒక ఇంగ్లాండ్ క్రికెటర్‌గా యాషెస్ సిరీస్‌లో ఆడటం గొప్ప విషయంగా భావిస్తాను. ప్రపంచకప్ విజయంతో పొందిన ఆత్మవిశ్వాసాన్ని యాషెస్‌లోనూ కొనసాగించాలనుకుంటున్నాం. అదే జోరును సిరీస్ మొత్తం సాగించి సెప్టెంబర్‌లో ఓవల్‌లో ట్రోఫీను అందుకోవాలని ఆశిస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఈ ఆల్‌రౌండర్ వన్డే ప్రపంచకప్ జట్టులో ఎంపిక కాలేదు. ఈ నెల చివర్లో ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది భారత్‌తో టెస్టు సిరీస్ విజయంలో కర్రన్ కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.