
ఫిఫా వరల్డ్ కప్ 2026లో గ్రూప్-కె మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఉజ్బెకిస్తాన్‌ను 5-0 తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో పోర్చుగల్ నాకౌట్ దశకు మరింత చేరువ కాగా, స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డీఆర్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన రొనాల్డోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఉజ్బెకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి విమర్శకులకు తనదైన శైలిలో బదులిచ్చాడు. ఈ రెండు గోల్స్‌తో ఆరు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్‌లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2006 నుంచి 2026 వరకు జరిగిన ఆరు ప్రపంచకప్ టోర్నీల్లో గోల్స్ చేసిన ఏకైక ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.
మ్యాచ్ ప్రారంభమైన ఆరో నిమిషానికే రొనాల్డో గోల్ చేసి పోర్చుగల్‌కు ఆధిక్యం అందించాడు. అనంతరం 17వ నిమిషంలో నూనో మెండిస్ అద్భుత ఫ్రీకిక్ ద్వారా స్కోరు 2-0కి పెంచాడు. తొలి అర్ధభాగం ముగిసే ముందు 39వ నిమిషంలో రొనాల్డో మరోసారి గోల్ చేయడంతో పోర్చుగల్ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలో ఉజ్బెకిస్థాన్ గోల్‌కీపర్ అబ్దువోఖిద్ నెమటోవ్ చేసిన ఓన్ గోల్‌తో స్కోరు 4-0 అయ్యింది.
RONALDO x SIUUU! 🇵🇹 pic.twitter.com/jl7P753dHJ
— World Cup 2026 (@WorldCupMedia) June 23, 2026
మ్యాచ్ చివర్లో రాఫెల్ లియో గోల్ చేయడంతో పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించింది. మొత్తం మ్యాచ్‌లో పోర్చుగల్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో 1-1తో డ్రా అయిన తర్వాత ఈ విజయంతో జట్టు ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందింది. ప్రస్తుతం గ్రూప్-కెలో నాలుగు పాయింట్లతో నాకౌట్ అవకాశాలను బలపర్చుకుంది. మ్యాచ్ అనంతరం రొనాల్డో కెమెరా ముందు “ఐ యామ్ బ్యాక్” అంటూ స్పందించడం అభిమానులను ఉత్సాహపరిచింది. 41 ఏళ్ల వయసులోనూ ప్రపంచకప్ వేదికపై తన ప్రభావం ఏమాత్రం తగ్గలేదని అతడు మరోసారి నిరూపించాడు.
History for @Cristiano! 🇵🇹
Cristiano Ronaldo has become the first player to score in six different @FIFAWorldCup tournaments! ⚽️ pic.twitter.com/qI1Zvt0uJS
— FIFA (@FIFAcom) June 23, 2026
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి