PKL 2024: సొంతగడ్డపై ఆఖరి పోరులో తెలుగు టైటాన్స్‌ ఉత్కంఠ విజయం..

|

Nov 09, 2024 | 9:16 PM

ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)  11వ సీజన్‌ లో సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌ చెక్ పెట్టి వరుసగా నాలుగో విజయం సాధించింది.

PKL 2024: సొంతగడ్డపై ఆఖరి పోరులో తెలుగు టైటాన్స్‌ ఉత్కంఠ విజయం..
Telugu Titans Betas Puneri Paltan
Follow us on

హైదరాబాద్‌, 9 నవంబర్: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)  11వ సీజన్‌ లో సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు విజయంతో ముగించింది. ఉత్కంఠ పోరులో ఆఖరి నిమిషాల్లో విజయ్ మాలిక్ ప్రతిభతో టేబుల్ టాపర్, డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్‌ చెక్ పెట్టి వరుసగా నాలుగో విజయం సాధించింది. గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియం వేదికగా శనివారం రాత్రి జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 34–33 తేడాతో పుణెరిని ఓడించింది. టైటాన్స్ జట్టులో విజయ్ 13 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌‌గా నిలవగా, కెప్టెన్ పవన్ సెహ్రావత్ 12 పాయింట్లతో మరో సూపర్ టెన్ సాధించాడు. పుణెరి జట్టులో పంకజ్ మోహితే 9 పాయింట్లతో సత్తా చాటాడు. అతనికి తోడు అజిత్ కుమార్ ఆరు, మోహిత్ గోయత్ ఐదు పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది.

ఆధిపత్యం చేతులు మారతూ..

ఆట ఆరంభంలో తెలుగు టైటాన్స్ అదరగొట్టింది. కెప్టెన్‌ పవన్ సెహ్రావత్‌ వరుస రెయిడ్ పాయింట్లకు తోడు డిఫెండర్లు కూడా సత్తా చాటారు. తన మూడు రెయిడ్స్‌ లో పవన్ నాలుగు పాయింట్లు రాబట్టాడు. దాంతో టైటాన్స్ 5–0 ఆధిక్యంతో ఆటను ఆరంభించింది. పుణెరి జట్టులో ఇద్దరు ఆటగాళ్లే మిగిలిపోవడంతో ఆ జట్టు ఆలౌట్‌ ప్రమాదం ముంగిట నిలిచింది. ఈ దశలో పంకజ్ బోనస్ పాయింట్‌తో పుణెరి ఖాతా తెరిచాడు. పవన్‌ మరో టచ్ పాయింట్ట రాబట్టగా.. పుణెరి కోర్టులో పంకజ్ ఒక్కడే మిగిలాడు. తీవ్ర ఒత్తిడిలో కూతకు వెళ్లిన పంకజ్‌ బోనస్‌, సూపర్‌‌ రెయిడ్‌తో మూడు పాయింట్లతో జట్టును ఆదుకున్నాడు. ఆ వెంటనే పవన్‌ను సూపర్ ట్యాకిల్ చేసిన పుణెరి 6–6తో స్కోరు సమం చేసింది. అస్లాం, పంకజ్ చెరో పాయింట్ రాబట్టగా.. కోర్టులో మిగిలిన విజయ్‌ను ట్యాకిల్ చేసిన పుణెరి డిఫెండర్లు తెలుగు టైటాన్స్‌ను ఆలౌట్ చేశారు. దాంతో పుణెరి 13–9తో ఆధిక్యంలోకి వెళ్లింది. జట్టు మొత్తం కోర్టుపైకి వచ్చిన తర్వాత టైటాన్స్‌ తిరిగి పుంజుకుంది. పవన్ తన జోరు కొనసాగిస్తూ సూపర్‌‌ టెన్ పూర్తి చేసుకున్నాడు. మరో రెయిడర్ విజయ్‌ మాలిక్ కూడా ఆకట్టుకోగా.. డిఫెన్స్ విభాగం కూడా మెరుగవ్వడంతో పుణెరిని ఆలౌట్ చేసి ప్రతీకారం తీర్చుకున్న తెలుగు జట్టు 20–18తో తిరిగి ఆధిక్యం సాధించింది. కానీ, విరామం ముంగిట పవన్ ప్రత్యర్థి డిఫెండర్లకు దొరికిపోవడంతో తొలి అర్ధభాగం 20–20తో సమంగా ముగిసింది.

హోరాహోరీ పోరులో టైటాన్స్ పైచేయి..

రెండో అర్ధభాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. ఇరు జట్లూ చెరో పాయింట్ నెగ్గుతూ ముందుకెళ్లడంతో ఆట సమంగా సాగింది. విరామం తర్వాత పది నిమిషాల్లో చెరో నాలుగు పాయింట్లు మాత్రమే రాబట్టాయి. అటు టైటాన్స్, ఇటు పల్టాన్‌ ఏ మాత్రం తప్పిదానికి తావివ్వకుండా ఆడే ప్రయత్నం చేశాయి. ఇరు జట్ల డిఫెన్స్ బలంగా ఉండటంతో ఎక్కువగా ఎమ్టీ రెయిడ్స్‌ వచ్చాయి. టైటాన్స్ ఒక్కో పాయింట్ ఆధిక్యంతో ముందుకెళ్లే ప్రయత్నం చేసినా పుణెరి వెంటనే స్కోరు సమం చేయడంతో ఆట ఉత్కంఠగా సాగింది. అయితే రెండో భాగంలో పవన్ సెహ్రావత్ వేగం తగ్గింది. విజయ్‌ సూపర్ టెన్ పూర్తి చేసుకున్నా.. టైటాన్స్ కోర్టులో తక్కువ మంది ఉండటంతో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెరిగింది. ఓ దశలో 31–29తో ఆధిక్యంలో ఉన్న టైటాన్స్‌ మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా ఆలౌట్‌ అయింది. దాంతో పుణెరి 33–32తో ఒక పాయింట్ ఆధిక్యంలోకి వచ్చింది. చివరి నిమిషంలో విజయ్‌ ఒక రెయిడ్ పాయింట్‌తో పాటు అజిత్‌ కుమార్‌‌ను ట్యాకిల్ చేయడంతో టైటాన్స్ ఒక్క పాయింట్ తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది.

పుణెరి పల్టాన్‌‌పై టైటాన్స్ విజయం