
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-కె చివరి మ్యాచ్‌లో ఒక అద్భుతమైన హైడ్రామా చోటుచేసుకుంది. పోర్చుగల్, కొలంబియా జట్ల మధ్య జరిగిన ఈ హోరాహోరీ పోరు డ్రాగా ముగిసింది. అయితే, మ్యాచ్ 90వ నిమిషంలో కొలంబియా జట్టు ఒక సూపర్ గోల్ సాధించింది. దాంతో క్రిస్టియానో రొనాల్డో కెప్టెన్సీలోని పోర్చుగల్ జట్టు ఓడిపోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. రెఫరీ ఆ గోల్‌ను నిశితంగా పరిశీలించి ఆఫ్ సైడ్‌గా ప్రకటించడంతో కొలంబియా గోల్ చెల్లకుండా పోయింది. దీంతో పోర్చుగల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రూప్ పాయింట్ల పట్టిక ఇలా ఉంది
ఈ మ్యాచ్ డ్రా అయినప్పటికీ కొలంబియా జట్టు 7 పాయింట్లతో గ్రూప్-కె లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. పోర్చుగల్ జట్టు 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇదే గ్రూపులో జరిగిన మరో మ్యాచ్‌లో డీఆర్ కాంగో జట్టు 3-1 తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఈ గ్రూప్ సమీకరణాల ప్రకారం కొలంబియా, పోర్చుగల్, డీఆర్ కాంగో జట్లు వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 32 (నౌకౌట్ స్టేజ్) లోకి అధికారికంగా అడుగుపెట్టాయి.
నెక్స్ట్ రౌండ్‌లో క్రొయేషియాతో పోర్చుగల్ ఫైట్
రౌండ్ ఆఫ్ 32 నౌకౌట్ పోరులో పోర్చుగల్ జట్టు జూలై 3వ తేదీ శుక్రవారం నాడు టొరంటో వేదికగా బలమైన క్రొయేషియా జట్టుతో తలపడనుంది. క్వార్టర్ ఫైనల్స్ రేసులో నిలవాలంటే రోనాల్డో సేనకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ గోల్‌కీపర్ అద్భుతమైన ప్రదర్శన చేసి జట్టును ఆదుకున్నాడు. ఇదే ఫామ్‌ను క్రొయేషియాపై కూడా కొనసాగించాలని పోర్చుగల్ భావిస్తోంది.
అర్జెంటీనాతో మ్యాచ్ సాధ్యమేనా?
క్రిస్టియానో రొనాల్డో వర్సెస్ లియోనెల్ మెస్సీల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్‌ను చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం, ఫిఫా వరల్డ్ కప్ 2026లో పోర్చుగల్, అర్జెంటీనా జట్లు రెండు వేర్వేరు హాఫ్‌లలో ఉన్నాయి. ఈ రెండు జట్లు తమ తమ నౌకౌట్ మ్యాచ్‌లలో గెలుస్తూ కేవలం ఫైనల్స్‌కు చేరుకుంటేనే రోనాల్డో వర్సెస్ మెస్సీల డ్రీమ్ మ్యాచ్ సాధ్యమవుతుంది. కాగా, రౌండ్ ఆఫ్ 32లో అర్జెంటీనా జట్టు జూలై 4వ తేదీ శనివారం నాడు కేప్ వర్డే జట్టుతో తలపడనుంది.
మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..