Bhagwani Devi Dagar: 94 ఏళ్ల అథ్లెట్.. స్వర్ణంతో సహా 3 పతకాలు సొంతం.. ఫిన్లాండ్‌లో సత్తా చాటిన భారత బామ్మ..

World Masters Athletics championships 2022: ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022లో, భగవానీ దేవి దాగర్ ఒక స్వర్ణంతో సహా మొత్తం 3 పతకాలను గెలుచుకుంది.

Bhagwani Devi Dagar: 94 ఏళ్ల అథ్లెట్.. స్వర్ణంతో సహా 3 పతకాలు సొంతం.. ఫిన్లాండ్‌లో సత్తా చాటిన భారత బామ్మ..
World Masters Athletics Championships 2022 Bhagwani Devi Dagar

Updated on: Jul 11, 2022 | 4:55 PM

ప్రస్తుతం వయసు పెరుగుతుంటే విశ్రాంతి తీసుకోవాలని ఎంతో మంది చూస్తు్న్నారు. యువకులు కూడా ప్రస్తుతం ఇదే ఆలోచనతో బద్దకంగా తయారవుతున్నట్లు ఎన్నో సర్వేలు చూస్తూనే ఉన్నాం. అయితే, ఓ బామ్మ మాత్రం 90 ఏళ్లు దాటినా, ఇంకా తనలో సత్తా ఉందంటూ అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ప్రతిభకు వయసు అడ్డు కాదంటూ మరోసారి జనాలకు చాటి చెప్పిన ఈ బామ్మపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏంటి, ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతున్నారా.. అవునండీ.. నిజమే.. అదికూడా విదేశీ గడ్డపై భారత ఉమెన్ అథ్లెట్ చరిత్ర సృష్టించింది. ఫిన్‌లాండ్‌లో భారతదేశానికి పతాకాలను కూడా అందించింది. 94 సంవత్సరాల వయస్సులో, భగవాన్ దేవి దాగర్(Bhagwani Devi Dagar) ఫిన్లాండ్‌లో భారతదేశం ప్రతిష్టను పెంచింది. వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2022(World Masters Athletics championships 2022) లో సీనియర్ సిటిజన్ విభాగంలో పాల్గొని, ఒక స్వర్ణంతో సహా 3 పతకాలను గెలుచుకుని ఆశ్చర్యపరిచింది. 100 మీటర్ల రేసులో భగవానీ స్వర్ణం, షాట్‌పుట్‌లో కాంస్య పతకం సాధించింది. 100 మీటర్ల రేసును కేవలం 24.74 సెకన్లలో పూర్తి చేసి భారత్‌కు స్వర్ణం అందించి, ఔరా అనిపింది. ఈ టోర్నమెంట్ జూన్ 29న ప్రారంభమై జులై 10న ముగిసింది.

వయస్సు అడ్డంకి కాదు..

క్రీడా మంత్రిత్వ శాఖ భగవానీ దేవిని ప్రశంసలతో ముంచెత్తింది. వయస్సు అడ్డంకి కాదని ఆమె మరోసారి నిరూపించిందంటూ ట్వీట్ చేసింది. ఇంతకుముందు ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు, షాట్‌పుట్, జావెలిన్ త్రోలో 3 బంగారు పతకాలు సాధించింది.

భగవానీ దేవి మనవడు వికాస్ దాగర్ అంతర్జాతీయ పారా అథ్లెట్. అతను 2014 గ్రాండ్ పీ ఈవెంట్‌లో 3 బంగారు పతకాలు సాధించాడు. అతని వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా, దేశం మొత్తం ఈ బామ్మ ధైర్యాన్ని, అభిరుచిని కొనియాడుతోంది. ఈ గ్రానీ ఎవరికీ తక్కువ కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.