Jallikattu Competitions: సంక్రాంతి పోయి నెల దాటింది…! పండగ నెల కూడా మారిపోయింది…! సంక్రాంతి పండుగకు ఆనవాయితీగా జరిగే జల్లికట్టు పోటీలకు.. ఫిబ్రవరి నెల సగం పూర్తైనా బ్రేక్ పడడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉన్నాయి. కోయంబత్తూరుజిల్లా చెట్టిపాలయంలో జల్లికట్టు పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీలను తమిళనాడు రాష్ట్ర మంత్రి వేలుమణి ప్రారంభించారు.
ఈ పోటీల్లో కొమ్ములు తిరిగిన వెయ్యి ఎద్దులను తీసుకొచ్చారు నిర్వాహకులు. కోయంబత్తూరుజిల్లాకు చెందిన సుమారు 750 మంది యువకులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. ఇక జల్లికట్టు పోటీలను చూసేందుకు వచ్చిన జనాలతో గ్రౌండ్ కిక్కిరిసి పోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గ్రౌండ్‌లోకి వదిలిన ఎద్దులను పట్టుకునేందుకు యువకులు పోటీపడ్డారు. పరుగుతీస్తున్న వృషభాలను నిలువురించేందుకు ప్రయత్నించారు. కొమ్ములతో కుమ్మేస్తూ పరుగులు తీశాయి ఎద్దులు. ఈ ఘటనలో ఇప్పటివరకూ 14 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించారు. అయితే జల్లికట్టు పోటీలు కంటిన్యూగా కొనసాగాయి.
అనేకమంది గాయపడినా నిర్వాహకులు పట్టించుకోలేదు. పోలీసులు అక్కడే ఉన్నా…యువకులు గాయపడినా..అదంతా ఆటలో భాగంగానే చూశారు. సాయంత్రం వరకూ నిర్వహించిన ఈ పోటీల్లో నిర్వాహకులు విజేతలను ప్రకటించి బహుమతులు అందజేశారు.
అయితే పోటీలు కంటిన్యూగా కొనసాగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. రాజకీయ పలుకుబడితోనే జల్లికట్టు పోటీలను నిర్వహిస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అటు కోవిడ్ నిబంధనలున్నా..నిర్వాహకులు పట్టించుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.