FIFA Shock to Pakistan: ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆఫ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నాడు అధికారికంగా ప్రకనట విడుదల చేసింది. పాకిస్తాన్‌తో పాటు.. చద్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌పైనా వేటు వేసింది. థర్డ్ పార్టీ జోక్యాన్ని కారణంగా చూపుతూ పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(పీఎఫ్ఎఫ్)పై వేటు వేసింది. థర్డ్ పార్టీ జోక్యం అనేది ఫిఫా నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది. ఆ నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారనే కారణంగానే ఫిఫా ఇంటర్నేషనల్ ఈ చర్యకు పాల్పడింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అయ్యింది. ఈ చర్యలతో పీఎఫ్ఎఫ్ ఇకపై ఫిఫా నుండి ఎలాంటి ఆర్థిక సాయం అందుకోలేదు. ఇది పీఎఫ్ఎఫ్ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. లాహోర్‌లోని పిఎఫ్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల కొందరు నిరసనకారలు బృందం స్వాధీనం చేసుకుంది. అంతేకాదు.. ఫిఫా కౌన్సిల్ బ్యూరో నియమించిన హారూన్ మాలిక్ నేతృత్వంలోని పిఎఫ్ఎఫ్ కమిటీకి వ్యతిరేకంగా ఆ నిరసనకారులు హల్‌చల్ చేశారు. ఆ కమిటీని తొలగించి.. సయ్యద్ అష్ఫక్ షా కమిటీకి బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఫిఫా కౌన్సిల్ బ్యూరో.. నిరసనకారుల దురాక్రమణను తీవ్రంగా ఖండించింది. ఫిఫా గుర్తించిన ఆఫీసు బేరర్లను అంగీకరించాలని పిఎఫ్ఎఫ్‌కు ఒక లేఖ రాసింది. అయితే.. దీనిపై పిఎఫ్ఎఫ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఈ ఘటనపై చర్చించి.. పిఎఫ్ఎఫ్‌పై వేటు వేసింది. ఈ చర్యతో పాకిస్తాన్ ఫుట్ జట్టు ఫిఫా ఆధ్వర్యంలో జరిగే ఏ పోటీల్లోనూ పాల్గొనకుండా అయ్యింది.