CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం

CWG 2026 : కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్‌కర్ చారిత్రక స్వర్ణ పతకం సాధించింది. అదే ఈవెంట్‌లో శిల్పా శైలకు నాటకీయ పరిణామాల మధ్య కాంస్య పతకం దక్కింది. దీంతో పారా అథ్లెటిక్స్‌లో భారత్ డబుల్ సంబరాలు చేసుకుంది.

CWG 2026 : పోలియోను జయించి పసిడి కొట్టింది.. కామన్వెల్త్‌లో భారత్‌కు చారిత్రక స్వర్ణం
Sharmila Dhankar

Updated on: Jul 28, 2026 | 9:46 AM

CWG 2026 : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత పారా అథ్లెటిక్స్ విభాగంలో సరికొత్త చరిత్ర నమోదైంది. మహిళల షాట్‌పుట్ F57 ఈవెంట్‌లో భారత పారా అథ్లెట్ షర్మిలా ధన్‌కర్ అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సాధించారు. కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు లభించిన మొట్టమొదటి పసిడి పతకం ఇదే కావడం విశేషం. 40 ఏళ్ల షర్మిలా తన శ్రమను నమ్ముకుని, అత్యుత్తమంగా 9.81 మీటర్ల దూరం ఇనుప గుండును విసిరి ఈ సీజన్ బెస్ట్ త్రో నమోదు చేశారు. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ పారా అథ్లెటిక్స్‌లో పతకం కోసం భారత్ గడిపిన 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

ఇదే ఈవెంట్‌లో భారత్‌కు చెందిన మరో పారా అథ్లెట్ శిల్పా శైల కూడా కాంస్య పతకంతో మెరిశారు. అయితే ఈ పతకం దక్కడం వెనుక తీవ్రమైన వివాదం, నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శిల్ప తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనగా 7.26 మీటర్ల దూరం విసిరి మొదట నాలుగో స్థానంలో నిలిచారు. కాంస్య పతకం నైజీరియాకు చెందిన ప్రసిద్ధ అథ్లెట్ యుచారియా ఇయాజీకి దక్కినట్లు ప్రకటించారు. అయితే నైజీరియన్ అథ్లెట్ చేసిన త్రో నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ భారత బృందం వెంటనే గట్టిగా నిరసన తెలపడమే కాకుండా అధికారికంగా అప్పీల్ చేసింది.

భారత అధికారుల నిరసనను స్వీకరించిన నిర్వాహక కమిటీ, వీడియో రివ్యూ నిర్వహించి నైజీరియా అథ్లెట్ వేసిన చెల్లుబాటయ్యే ఏకైక త్రోను కూడా ‘ఫౌల్’గా ప్రకటించింది. దీంతో నాలుగో స్థానంలో ఉన్న భారత అథ్లెట్ శిల్పా శైల మూడో స్థానానికి చేరి కాంస్య పతక విజేతగా నిలిచారు. ఈ నిర్ణయంతో శిల్ప ఆనందభాష్పాలు రాల్చగా, షర్మిలతో కలిసి పతక సంబరాలు చేసుకున్నారు. ఒకే ఈవెంట్‌లో భారత్‌కు రెండు పతకాలు రావడం విశేషం. అయితే ఈ నిర్ణయంపై నైజీరియా బృందం కూడా కౌంటర్ ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం.

F57 క్లాసిఫికేషన్ అనేది కాళ్ల వైకల్యం, అవయవ లోపాలు ఉన్న అథ్లెట్ల కోసం కేటాయించిన విభాగం. షర్మిలా ధన్‌కర్ కేవలం రెండు సంవత్సరాల వయస్సులోనే పోలియో మహమ్మారి బారినపడి తన ఎడమ కాలును కోల్పోయారు. అయినప్పటికీ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా క్రీడల్లో రాణించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఫజ్జా ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లోనూ ఆమె స్వర్ణ పతకం సాధించారు. గత 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న ఆమె, ఈసారి ఏకంగా స్వర్ణంతో దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us