Video: సెల్యూట్ చేయాల్సిందే.. 7 నెలల గర్భంతో 145 కేజీల డెడ్‌లిఫ్ట్‌ పోటీలకు.. కట్‌చేస్తే..

Sonika Yadav Won Bronze Medal: వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్‌లో, సోనికా యాదవ్ స్క్వాట్స్‌లో 125 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 80 కిలోలు, డెడ్‌లిఫ్ట్‌లో 145 కిలోలు ఎత్తింది. దీంతో పోటీలో ఆమె మొత్తం బరువును 350 కిలోలకు పెంచి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Video: సెల్యూట్ చేయాల్సిందే.. 7 నెలల గర్భంతో 145 కేజీల డెడ్‌లిఫ్ట్‌ పోటీలకు.. కట్‌చేస్తే..
Sonika Yadav

Updated on: Oct 28, 2025 | 3:37 PM

Sonika Yadav Won Bronze Medal: అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసింది ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ సోనికా యాదవ్.! మహిళా శక్తికి, దృఢ సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఏడు నెలల నిండు గర్భంతో ఉన్నప్పటికీ, ఆమె ఇటీవల జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని ఏకంగా 145 కిలోల డెడ్‌లిఫ్ట్‌ను విజయవంతంగా ఎత్తి, కాంస్య పతకం గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

క్రీడా స్ఫూర్తిని చాటిన సోనికా..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీలలో ఢిల్లీ పోలీస్ తరఫున సోనికా యాదవ్ (31) పాల్గొన్నారు. సాధారణంగా 65 కిలోల విభాగంలో పోటీపడే ఆమె, ఈసారి 84+ కిలోల విభాగంలో బరిలోకి దిగారు. స్టేజీపైకి వచ్చిన వెంటనే ఆమెను చూసిన వారంతా సాధారణ క్రీడాకారిణిగానే భావించారు. అయితే, తన చివరి డెడ్‌లిఫ్ట్ ప్రయత్నంలో, ఆమె ఏడు నెలల గర్భిణి అని తెలిసినప్పుడు స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఆమె సంకల్పం ముందు ఆశ్చర్యం ఎక్కువ సేపు నిలవలేదు. పూర్తి ఏకాగ్రతతో 145 కిలోల బరువును ఎత్తి పట్టుకున్న తీరుకు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో ఆమెను అభినందించారు.

శిక్షణను ఆపని పట్టుదల..

సోనికా యాదవ్ 2023 లో పవర్‌లిఫ్టింగ్‌ను ప్రారంభించారు. 2025 మే నెలలో ఆమె గర్భవతి అని నిర్ధారణ అయిన తర్వాత, భర్తతో సహా కుటుంబ సభ్యులు ఆమె శిక్షణను ఆపేస్తుందని భావించారు. కానీ, సోనికా మాత్రం తన క్రీడా ఆసక్తిని, ఫిట్‌నెస్‌ పట్ల ఉన్న మక్కువను వదులుకోలేదు.

“గర్భం ఒక అడ్డంకి కాదు. స్త్రీలు చేయలేరన్న భావన తప్పు. నేను వైద్యుల సలహా మేరకు, నిపుణుల పర్యవేక్షణలో నా శిక్షణను కొనసాగించాను” అని సోనికా తెలిపారు. ప్రపంచంలోనే అరుదైన విజయంగా పరిగణించబడే ఈ ఘనతను సాధించడానికి, గర్భంతో ఉన్నప్పుడూ వెయిట్‌లిఫ్టింగ్ చేసిన అంతర్జాతీయ లిఫ్టర్ లూసీ మార్టిన్స్ నుంచి ఆమె ప్రేరణ పొందారు.

పోటీలలో సోనికా కేవలం డెడ్‌లిఫ్ట్‌లోనే కాదు, స్క్వాట్స్‌లో 125 కిలోలు, బెంచ్ ప్రెస్‌లో 80 కిలోలు ఎత్తి మొత్తం 350 కేజీల బరువును ఎత్తి కాంస్యం సాధించడం గమనార్హం.

అందరికీ ఆదర్శం..

సోనికా సాధించిన ఈ విజయం, ఆమె పటిష్టమైన మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఫిట్‌నెస్ పట్ల ఆమెకున్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. ఈ పోటీ తర్వాత వివిధ పోలీసు విభాగాల మహిళా అధికారులంతా ఆమెను అభినందించడానికి వచ్చి ఫోటోలు దిగారు. గర్భధారణ అనేది దైనందిన జీవితానికి, కలలకు అడ్డంకి కాదని, సరైన పర్యవేక్షణ, శ్రద్ధ ఉంటే మహిళలు అసాధారణమైన విజయాలు సాధించగలరని సోనికా యాదవ్ నిరూపించారు. 2014 బ్యాచ్ కానిస్టేబుల్ అయిన సోనికా ప్రస్తుతం ఢిల్లీలోని కమ్యూనిటీ పోలీసింగ్ సెల్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..