భారత జట్టు మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీచంద్ (Dutee Chand) మరోసారి వార్తల్లో నిలిచింది. అలుపెరుగని పరుగుతో ఆటలో ఎన్నో మరుపురాని విజయాలు అందుకున్న ఈ మహిళా అథ్లెట్ తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అందుకే తన తల్లిదండ్రులు తనను దూరంగా ఉంచారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసిన ద్యుతి తాజాగా రిలేషన్‌షిప్, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కొద్దికాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న యువతినే పెళ్లి చేసుకుంటానంటూ ప్రకటించింది. ప్రస్తుతం ఇద్దరమూ కెరీర పరంగా బిజీగా ఉన్నామని, 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత పెళ్లిపీటలెక్కుతామంది. ఇదే సమయంలో తన శారీరక తత్వం కారణంగా సమాజంలో దారుణమైన వివక్షను ఎదుర్కొన్నానంటూ వాపోయిందీ స్టార్ స్ర్పింటర్.
మారుమూల గ్రామం నుంచి..
కాగా ఒడిశా లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ద్యుతి పరుగు పందేల్లో భారత్‌కు ఎన్నో పతకాలు, విజయాలు అందించింది. అదే సమయంలో వ్యక్తిగత విషయాలతో వివాదాల్లోనూ నిలిచింది. 2014 లో ద్యుతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె శరీరంలో మగవాళ్లకు ఉండాల్సిన టెస్టోస్టిరాన్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. దీంతో ఆమెను 2014 కామన్వెల్త్ క్రీడలకు దూరంగా ఉంచారు. దీనిపై ఐదేళ్ల పాటు న్యాయపోరాటం చేసిన ఆమె ఈనెల (జులై) 28 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. ఈ మెగా ఈవెంట్‌లో ద్యుతీ 200 మీటర్ల రేసులో బరిలోకి దిగనుంది. కాగా మోనాలిసా అనే మహిళతో సహజీవనం చేస్తున్నట్లు గతంలోనే బహిరంగంగా ప్రకటించింది ద్యుతి. ఈ కారణంగానే తన తల్లిదండ్రులు తనను దూరం పెట్టారంటూ ఓ సందర్భంలో వాపోయింది. కాగా భారత్‌లో సేమ్ సెక్స్ మ్యారేజ్ చట్ట వ్యతిరేకమన్న ప్రశ్నపై సమాధానం దాటవేసిన ఆమె.. ‘ఇప్పటికైతే మాకు పెళ్లిపై ఎలాంటి ప్రణాళికలు లేవు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత దాని గురించి ఆలోచిస్తాం. ఇక పెళ్లి ఇక్కడ చేసుకోవాలా..? విదేశాల్లోనా ..? అనేది నా పార్టనర్ ఇష్టం. రెండేళ్ల తర్వాత తాను ఎలా అంటే అలాగే పెళ్లిపీటలెక్కుతాం’ అని స్పష్టం చేసిందీ స్టార్ అథ్లెట్.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..