India Vs Australia 2020: సీనియర్ల గైర్హాజరీ.. ఆటగాళ్లకు గాయాలు.. ఇంకేముంది టీమిండియా ఖేల్ ఖతం అని కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు. అయితే వాళ్ల నోర్లు మూయిస్తూ భారత్.. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా ఆడుతోంది. టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోర్ సాధించినప్పటికీ.. టీమిండియా రెండో టెస్టులో అద్భుతంగా పోరాడింది. ఇంకా మూడో టెస్టు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గాయాలు వేధిస్తున్న.. మన ఆటగాళ్లు మైదానాన్ని వీడలేదు. గెలవాలనే కసితో వీరోచితంగా పోరాడారు. అలా పర్యటనలో చివరి ఘట్టానికి భారత్ చేరుకుంది.
నాలుగో టెస్టులో ఆడుతున్నది అందరూ కుర్రాళ్లే.. హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ యూనిట్‌ను ముందుంది నడిపించాడు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహనే తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా.. తన తండ్రి కలను నెరవేరుస్తూ కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి ఆస్ట్రేలియా పతనంలో కీలక పాత్ర పోషించాడు.
ఒక్క సిరాజ్ మాత్రమే కాదు.. మొదటి ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌లు టీమిండియాను ఆదుకున్న తీరు అమోఘం. అనుభవం ఉన్న ఆటగాళ్ల మాదిరిగా ఆసీస్ పేస్ త్రయాన్ని అద్భుతంగా ఎదుర్కున్నారు. ఏడో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలాగే విఫలమవుతూ వస్తున్న మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ కూడా తాము ఉన్నామంటూ తమవంతు పాత్రను పోషిస్తున్నారు. ఇలా జట్టులో సీనియర్లు లేకుండా, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రహనే సారధ్యం వహిస్తూ కొత్త కుర్రాళ్లు చెలరేగిపోతున్న తీరు అద్భుతం. ఆఖరి టెస్టులో ఇంక ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో.. సిరీస్ విజేతగా ఎవరు నిలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.