
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో మునుపెన్నడూ లేని విధంగా ఒక భారీ సంచలనం నమోదైంది. ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉండే కేవలం 5.5 లక్షల జనాభా కలిగిన కేప్ వర్డే అనే చిన్న దేశం ఫుట్‌బాల్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. టోర్నీలో అండర్‌డాగ్‌గా బరిలోకి దిగిన ఈ జట్టు, గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వీరోచితంగా పోరాడి రౌండ్ ఆఫ్ 32 (నాకౌవుట్) దశకు అర్హత సాధించింది. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ చరిత్రలోనే నాకౌవుట్ చేరిన అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశంగా కేప్ వర్డే సరికొత్త రికార్డును లిఖించింది. ది
కేప్ వర్డే జట్టుకు ఇదే మొదటి ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. టోర్నీ ప్రారంభానికి ముందు ఈ జట్టు గ్రూప్ స్టేజ్ దాటడం అసాధ్యమని అంతా భావించారు. ఎందుకంటే వీరు ఉన్న గ్రూప్‌లో మాజీ ఛాంపియన్లు, బలమైన జట్లు ఉన్నాయి. కానీ కేప్ వర్డే ఆటగాళ్లు ఏమాత్రం బెరవకుండా అసాధారణ నైపుణ్యంతో ఆడి, తమ గ్రూప్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని రౌండ్ ఆఫ్ 32 లోకి సగర్వంగా ప్రవేశించారు.
గ్రూప్ దశలో కేప్ వర్డే ప్రదర్శన చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. తమ మొదటి మ్యాచ్‌లోనే 2010 ప్రపంచ ఛాంపియన్ అయిన బలమైన స్పెయిన్ జట్టును 0-0తో నిలువరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత రెండు సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో 2-2తో డ్రా చేసుకుని గట్టి పోటీ ఇచ్చింది. ఇక మూడో మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో జరిగిన పోరులో కూడా 0-0తో డ్రా చేసుకొని అజేయంగా నాకౌవుట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
కేప్ వర్డే చారిత్రాత్మక విజయాల వెనుక ఆ జట్టు 40 ఏళ్ల సీనియర్ గోల్‌కీపర్ వోజిన్హా కొండంత అండగా నిలిచారు. టోర్నీ అంతటా ఆయన ప్రదర్శన ఫుట్‌బాల్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క గోల్ కూడా చిక్కకుండా మూడు సార్లు అద్భుతమైన సేవ్స్ చేశారు. మ్యాచ్ చివరి నిమిషాల్లో సౌదీ ఆటగాళ్లు చేసిన గోల్ ప్రయత్నాలను చిరుతపులిలా అడ్డుకుని తన దేశాన్ని నాకౌవుట్ చేర్చారు.
రౌండ్ ఆఫ్ 32 కు చేరిన కేప్ వర్డేకు తదుపరి మ్యాచ్‌లో ఊహించని పెద్ద సవాలు ఎదురుకానుంది. జూలై 3వ తేదీన జరగబోయే మ్యాచ్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన అర్జెంటీనాతో కేప్ వర్డే తలపడనుంది. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని బలమైన అర్జెంటీనాను ఎదుర్కొని, ఈ చిన్న దేశం మరోసారి సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి