
FIFA World Cup 2026 : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమైక్య (FIFA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ఫిఫా వరల్డ్ కప్ 2026 అనేక అద్భుతమైన రికార్డులకు వేదిక కాబోతోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో చరిత్రలోనే మొదటిసారిగా ఏకంగా 48 జట్లు పాల్గొంటున్నాయి. జట్ల సంఖ్య పెరగడమే కాకుండా.. ఈసారి టోర్నీలో ఇచ్చే ప్రైజ్ మనీ కూడా ఊహించని రీతిలో రికార్డు స్థాయికి చేరుకుంది. నిజానికి మొదట మొత్తం ప్రైజ్ పూల్‌ను 727 మిలియన్ డాలర్లుగా నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత జట్ల ప్రిపరేషన్ గ్రాంట్లు మరియు ఇతర అలవెన్సులను పెంచుతూ ఏకంగా 871 మిలియన్ డాలర్లకు (మన భారత కరెన్సీలో దాదాపు రూ.7,400 కోట్లు) పెంచుతూ ఫిఫా సంచలన నిర్ణయం తీసుకుంది.
చాంపియన్ జట్టుపై కాసుల వర్షం
ఈ మెగా టోర్నీలో వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుకునే విజేత (చాంపియన్) జట్టుపై పైసల వర్షం కురవనుంది. టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 51 మిలియన్ డాలర్లు (సుమారు రూ.433 కోట్లు) లభిస్తాయి. అలాగే రన్నరప్‌గా నిలిచే (రెండో స్థానం) జట్టుకు 34 మిలియన్ డాలర్లు (సుమారు రూ.289 కోట్లు) బహుమతిగా ఇస్తారు. టోర్నమెంట్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకునే జట్టుకు 30 మిలియన్ డాలర్లు (సుమారు రూ.255 కోట్లు), నాల్గవ స్థానంలో నిలిచే జట్టుకు 28 మిలియన్ డాలర్లు (సుమారు రూ.238 కోట్లు) చొప్పున ఫిఫా అందజేయనుంది.
నాకౌట్ దశలకు చేరితే కోట్లల్లో నజరానా
కేవలం టాప్-4 జట్లకు మాత్రమే కాకుండా.. టోర్నీలో ముందుకు సాగే కొద్దీ ప్రతి జట్టుకు భారీ మొత్తంలో డబ్బు అందనుంది. క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరి (5 నుంచి 8వ స్థానాలు) వెనుదిరిగే జట్లకు 20 మిలియన్ డాలర్లు (సుమారు రూ.170 కోట్లు) లభిస్తాయి. రౌండ్ ఆఫ్-16 లో అవుట్ అయ్యే జట్లకు (9 నుంచి 16వ స్థానాలు) 16 మిలియన్ డాలర్లు (సుమారు రూ.136 కోట్లు) ఇస్తారు. ఇక గ్రూప్ స్టేజ్‌లోనే నిష్క్రమించే జట్లలో.. 17 నుంచి 32వ స్థానాల్లో నిలిచే జట్లకు 12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.102 కోట్లు), 33 నుంచి 48వ స్థానాల్లో నిలిచే జట్లకు 10 మిలియన్ డాలర్ల (సుమారు రూ.85 కోట్లు) చొప్పున భారీ ప్రైజ్ మనీ సొంతం కానుంది.
పాల్గొనే ప్రతి జట్టుకు కనీస మొత్తం గ్యారెంటీ
ఈ ప్రైజ్ మనీతో పాటు.. టోర్నమెంట్‌లో పాల్గొనే అన్ని 48 జట్ల కోసం ఫిఫా ప్రత్యేకంగా 168 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఇందులో భాగంగా ప్రతి జట్టుకు తమ ప్రిపరేషన్ (ట్రైనింగ్ క్యాంప్‌లు, ప్రయాణ ఖర్చులు) కోసం ముందే 2.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ.21 కోట్లు) గ్రాంట్ అందుతుంది. దీనితో పాటు అడ్మినిస్ట్రేషన్, ఆటగాళ్లు మరియు అధికారుల ప్రయాణ నిర్వహణ కొరకు అదనపు ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. ఈ లెక్కన వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన ప్రతి జట్టుకు వారి ప్రదర్శనతో సంబంధం లేకుండా కనీసం 12.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.106 కోట్లు) గ్యారెంటీగా లభిస్తాయి. 48 జట్ల కొత్త ఫార్మాట్ మరియు రూ.7,400 కోట్ల రికార్డు బడ్జెట్‌తో 2026 ఫిఫా వరల్డ్ కప్ క్రీడా చరిత్రలోనే అత్యధిక ఆదాయం, లాభాలను తెచ్చిపెట్టే టోర్నీగా నిలవబోతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..