Video : రోనాల్డో టీమ్ ప్లేయర్ కాదా..? ఈ వీడియో చూస్తే సమాధానం దొరికేస్తుంది..

Video : ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఉజ్బెకిస్తాన్‌పై పోర్చుగల్ 5-0తో ఘన విజయం సాధించింది. క్రిస్టియానో రొనాల్డో రెండు గోల్స్ చేసి ఆరు వరల్డ్ కప్‌లలో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించగా, నునో మెండిస్ గోల్ వెనుక అతని సెల్ఫ్‌లెస్ ప్లాన్ వైరల్‌గా మారింది.

Video : రోనాల్డో టీమ్ ప్లేయర్ కాదా..? ఈ వీడియో చూస్తే సమాధానం దొరికేస్తుంది..
Fifa 2026

Updated on: Jun 25, 2026 | 10:46 AM

Video : ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా హ్యూస్టన్ స్టేడియంలో జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో పోర్చుగల్ జట్టు తిరుగులేని ప్రదర్శన చేసింది. ఉజ్బెకిస్తాన్ జట్టుతో జరిగిన ఈ పోరులో పోర్చుగల్ 5-0 గోల్స్ తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. మొదటి మ్యాచ్‌లో డీఆర్ కాంగోతో డ్రా చేసుకుని నిరాశపరిచిన పోర్చుగల్, ఈ మ్యాచ్‌లో మాత్రం మొదటి నిమిషం నుంచే దూకుడు ప్రదర్శించింది. హెడ్ కోచ్ రోబెర్టో మార్టినెజ్ మార్గదర్శకత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు మ్యాచ్‌పై పూర్తి నియంత్రణ సాధించి టోర్నమెంట్‌లో తమ మొదటి విజయాన్ని ఘనంగా చాటుకుంది.

రొనాల్డో వరల్డ్ రికార్డ్ మాస్టర్ క్లాస్

పోర్చుగల్ కెప్టెన్, ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో రెండు అద్భుతమైన గోల్స్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ గోల్స్‌తో ఆయన ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే సరికొత్త మైలురాయిని అందుకున్నారు. 2006, 2010, 2014, 2018, 2022, ప్రస్తుత 2026 వరల్డ్ కప్.. ఇలా వరుసగా ఆరు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్‌ టోర్నమెంట్లలో గోల్స్ చేసిన భూమి మీదున్న ఏకైక ఆటగాడిగా రొనాల్డో రికార్డుకెక్కాడు. అంతేకాకుండా పోర్చుగల్ తరఫున వరల్డ్ కప్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్‌గా కూడా నిలిచాడు.

నునో మెండిస్ గోల్ వెనుక రొనాల్డో మైండ్ గేమ్

ఈ మ్యాచ్‌లో రొనాల్డో చేసిన గోల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, 17వ నిమిషంలో అతని సహచర ఆటగాడు నునో మెండిస్ చేసిన ఫ్రీ-కిక్ గోల్ వెనుక రొనాల్డో పోషించిన పాత్ర అంతకంటే ఎక్కువ హైలైట్‌గా నిలిచింది. పోర్చుగల్‌కు ఫ్రీ-కిక్ అవకాశం వచ్చినప్పుడు రొనాల్డో తన పాత క్లాసిక్ స్టైల్‌లో నిలబడి, తానే కిక్ తీసుకోబోతున్నట్లు బిల్డప్ ఇచ్చాడు. దీంతో ఉజ్బెకిస్తాన్ డిఫెండర్లు, గోల్ కీపర్ అందరి దృష్టి రొనాల్డోపైనే పడింది. కానీ రెఫరీ విజిల్ వేయగానే.. అందరినీ ఆశ్చర్యపరుస్తూ రొనాల్డో కాకుండా లెఫ్ట్ ఫుట్ ప్లేయర్ నునో మెండిస్ వేగంగా వచ్చి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. రొనాల్డో సృష్టించిన ఈ డికాయ్ (డ్రామా) ప్లాన్ చూసి కామెంటేటర్లు సైతం ఫిదా అయ్యారు. రొనాల్డో కేవలం తన గురించే ఆలోచిస్తాడనే విమర్శకులకు ఈ సెల్ఫ్‌లెస్ గేమ్ ప్లాన్ ఒక గట్టి సమాధానం అని కొనియాడారు.

గోల్ కీపర్‌ను ఎలా బురిడీ కొట్టించామో చెప్పిన సిఆర్7

మ్యాచ్ ముగిసిన అనంతరం రొనాల్డో మీడియాతో మాట్లాడుతూ ఈ సీక్రెట్ ప్లాన్ వెనుక ఉన్న విషయాన్ని వెల్లడించాడు. “నిజానికి ఆ ఫ్రీ-కిక్ నేను తీసుకోవాల్సింది, కానీ ఉజ్బెకిస్తాన్ గోల్ కీపర్‌ను బురిడీ కొట్టించడానికి నేను ఒక ప్లాన్ చేశాను. నునో మెండిస్‌ను గట్టిగా కిక్ కొట్టమని చెప్పాను. ఆ ప్లాన్ వర్కవుట్ అయి గోల్ వచ్చింది. బయట నుండి వచ్చే విమర్శలను మనం కంట్రోల్ చేయలేం, కానీ జట్టుగా మేమంతా చివరి వరకు ఒకే తాటిపై ఉంటాం. ఈ రోజు జట్టులో అందరూ బాగా ఆడారు, గెలవడమే మా ప్రధాన లక్ష్యం” అని రొనాల్డో అన్నాడు.

జట్టు విజయమే ముఖ్యం – క్రిస్టియానో

వ్యక్తిగత రికార్డులపై స్పందిస్తూ రొనాల్డో చాలా పరిణతితో మాట్లాడాడు. “వ్యక్తిగతంగా రికార్డులు సాధించడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. కానీ నా మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ నా దేశానికి, నా జట్టుకు విజయాన్ని అందించడమే. మొదటి మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో మా జట్టు ఆటతీరు చాలా మెరుగైంది” అని రాయిటర్స్‌తో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో రొనాల్డో రెండు గోల్స్, నునో మెండిస్ ఒక గోల్, రాఫెల్ లియావో ఒక గోల్ చేయగా.. ఉజ్బెకిస్తాన్ గోల్ కీపర్ అబ్దువాహిద్ నెమటోవ్ చేసిన ఓన్ గోల్ కారణంగా ఉజ్బెకిస్తాన్ ఓటమి ఖాయమైంది. ఫాబియో కానవారో కోచింగ్‌లో బరిలోకి దిగిన ఉజ్బెకిస్తాన్‌కు ఈ మ్యాచ్ ఒక పెద్ద పాఠంగా మిగిలింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us