Team India: పిల్లి కాదు పులిరా మావ.! టీమిండియాకు దడపుట్టిస్తోన్న పసికూన జట్టు..

2026 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో సూపర్‌ 8కు చేరుకుంది. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి బలమైన జట్లను ఓడించి సంచలనం సృష్టించింది. సికందర్‌ రాజా సారథ్యంలో ఫీనిక్స్ పక్షిలా దూసుకెళ్తున్న జింబాబ్వే, ఇప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ లాంటి జట్లకు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉంది.

Team India: పిల్లి కాదు పులిరా మావ.! టీమిండియాకు దడపుట్టిస్తోన్న పసికూన జట్టు..
టీమిండియా గ్రూప్‌లో అమెరికా, పాకిస్తాన్, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. భారత జట్టు తదుపరి మ్యాచ్ నమీబియాతో జరుగుతుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత, భారత జట్టు కొలంబోకు వెళ్లి పాకిస్తాన్‌తో తలపడుతుంది. చివరగా ఫిబ్రవరి 18న నరేంద్ర మోడీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో తలపడుతుంది.

Updated on: Feb 20, 2026 | 12:10 PM

2026 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే జట్టు అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో అర్హత సాధించలేకపోయినప్పటికీ, ఈసారి జింబాబ్వే క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా బరిలోకి దిగింది. ఒకప్పుడు ఫ్లవర్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్, అలిస్టర్ క్యాంపెబెల్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో కలకలలాడిన ఆ జట్టు గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే, ప్రస్తుత టోర్నీలో సికందర్‌ రాజా నాయకత్వంలోని జింబాబ్వే ఒక ఫీనిక్స్ పక్షిలా పైకి లేచి, గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్‌ 8కు చేరుకుంది.

జింబాబ్వే తమ గ్రూప్ దశలో బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించి తొలి సంచలనం నమోదు చేసింది. కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్‌‌లో మొదట బ్యాటింగ్ చేసి మందకొడి పిచ్‌పై 169 పరుగులు సాధించింది. అనంతరం బౌలింగ్‌లో రాణించి ట్రావిస్‌ హెడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ లాంటి విధ్వంసకర బ్యాటర్‌లను పెవిలియన్‌కు పంపి ఆస్ట్రేలియాను ఓడించింది. ఆస్ట్రేలియాపై విజయం కేవలం అదృష్టం కాదని జింబాబ్వే వెంటనే నిరూపించింది. ఆతిథ్య శ్రీలంకతో జరిగిన అదే కొలంబో మ్యాచ్‌‌లో 179 పరుగుల లక్ష్యాన్ని అద్భుతంగా ఛేదించింది. బ్రియన్‌ బెన్నెట్ 63 పరుగులతో ఆకట్టుకోగా, సికందర్‌ రాజా కేవలం 26 బంతుల్లో 45 పరుగులు చేసి శ్రీలంక స్పిన్నర్‌లను చిత్తు చేశాడు. చివరి నిమిషంలో టోనీ మున్యోంగా సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించి, ఆరు వికెట్ల తేడాతో జింబాబ్వేకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ విజయాలతో 2026 టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలో ఓటమి ఎరుగని నాలుగు జట్లలో ఒకటిగా జింబాబ్వే రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు అందరి దృష్టి సూపర్‌ 8 దశపై ఉంది. భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వంటి బలమైన జట్లు ఉన్న కఠినమైన గ్రూప్‌లోకి జింబాబ్వే చేరింది. కాగితంపై ఈ జట్లు బలంగా ఉన్నప్పటికీ, జింబాబ్వే ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఏ జట్టునైనా ఓడించే సత్తా వారికి ఉందని స్పష్టమవుతోంది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ, తమకున్న ఊపుతో పెద్ద జట్ల సెమీఫైనల్ ఆశలపై నీళ్లు చల్లడానికి జింబాబ్వే సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో, జింబాబ్వేను ఎదుర్కోవడానికి టీం ఇండియా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనెల 22వ తేదీన అహ్మదాబాద్‌లో సౌత్ ఆఫ్రికాతో టీం ఇండియా తలపడనుంది. ఆ తర్వాత, ఈనెల 26వ తేదీన చెన్నై వేదికగా జింబాబ్వేతో టీం ఇండియా మ్యాచ్ ఆడనుంది. జింబాబ్వే ప్రదర్శన ఈ టోర్నీలో ఒక కీలక అంశంగా మారింది.

Follow Us