Yuvraj Singh : టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణం టీవీ చూడకపోవడమేనట.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కెరీర్లో అత్యంత ముఖ్యమైన కల 2011లో నెరవేరింది. అదే, భారత్ వరల్డ్ కప్ గెలవడం. ఆ ప్రపంచ కప్ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై ఎత్తుకుని స్టేడియం చుట్టూ తిప్పిన దృశ్యం ఇప్పటికీ క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది.

Yuvraj Singh : టీమిండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణం టీవీ చూడకపోవడమేనట.. యువరాజ్ సంచలన వ్యాఖ్యలు
Yuvraj Singh

Updated on: Aug 12, 2025 | 3:54 PM

Yuvraj Singh : భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితంలో అతిపెద్ద కల 2011లో నెరవేరింది. అదే, టీమిండియా సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్ గెలవడం. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు సచిన్‌ను భుజాలపై ఎత్తుకుని స్టేడియం మొత్తం ఊరేగారు. ఆ రోజు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. అయితే, ఆ ప్రపంచ కప్ గెలవడానికి ముందు సచిన్ జట్టు ఆటగాళ్లను టీవీ చూడొద్దని నిషేధించాడు. ఈ విషయాన్ని 2011 ప్రపంచ కప్ హీరో యువరాజ్ సింగ్ ఒక కార్యక్రమంలో వెల్లడించారు. జట్టుపై ఒత్తిడి తగ్గించడానికి సచిన్ వేసిన ఈ ఎత్తుగడ చివరకు ప్రపంచ కప్ గెలుచుకోవడానికి ఎలా ఉపయోగపడిందో యువరాజ్ వివరించారు.

2011 వరల్డ్ కప్ సమయంలో టీమిండియా దక్షిణాఫ్రికాతో ఓడిపోయింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ ఫలితాలతో జట్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో టీమ్‌లోని ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన సచిన్, అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్ ఆటగాళ్లతో మాట్లాడారు. “మాకు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ టై అయింది.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో ఓడిపోయాం. దీంతో టీమ్‌పై చాలా విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో సచిన్, గ్యారీ కిర్‌స్టన్ మాతో మాట్లాడారు. ఇకపై మనం టోర్నమెంట్‌పై మాత్రమే దృష్టి పెట్టాలని, టీవీ చూడకూడదని, పేపర్లు చదవకూడదని చెప్పారు. బయటి విషయాలపై దృష్టి పెట్టకుండా, కేవలం మ్యాచ్‌పైనే శ్రద్ధ పెట్టమని, రూమ్‌లోకి వెళ్లేటప్పుడు హెడ్‌ఫోన్స్ పెట్టుకోమని సలహా ఇచ్చారు” అని యువరాజ్ సింగ్ ఒక కార్యక్రమంలో పంచుకున్నారు.

సచిన్ ఇచ్చిన ఈ సలహా టీమిండియాకు చాలా ఉపయోగపడింది. ఆరంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ భారత జట్టు ఫైనల్‌కు చేరుకుంది. చివరికి ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి, 28 సంవత్సరాల తర్వాత వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో సచిన్ అత్యధికంగా 482 పరుగులు చేశాడు. గౌతమ్ గంభీర్ 393 పరుగులు, సెహ్వాగ్ 380 పరుగులు చేశారు. యువరాజ్ సింగ్ 362 పరుగులు చేసి, 15 వికెట్లు కూడా తీశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనకుగాను యువరాజ్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..