
WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ 2026లో క్రికెట్ అభిమానులకు అసలైన మజా దొరికింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫోర్లు, సిక్సర్ల వర్షంతో హోరెత్తిపోయింది. రెండు టీమ్‌లు కలిసి ఈ మ్యాచ్‌లో ఏకంగా 414 పరుగులు సాధించాయంటే బ్యాటర్ల ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, గెలుపు ముంగిట బోల్తా పడటం ఢిల్లీ వంతవ్వగా.. ఓటమి అంచుల్లో నుంచి అద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకోవడం గుజరాత్ సొంతమైంది. గుజరాత్ స్టార్ ప్లేయర్ సోఫీ డివైన్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌కు అసలైన హీరోగా నిలిచింది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ ఎంచుకోగా, గుజరాత్ ఓపెనర్లు సోఫీ డివైన్, బెత్ మూనీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా సోఫీ డివైన్ మైదానంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 95 పరుగులు బాది తృటిలో సెంచరీ మిస్ చేసుకుంది. బెత్ మూనీ(19), యాష్లే గార్డనర్(49) సహకారంతో గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఢిల్లీ బౌలర్ నందిని శర్మ 5 వికెట్లతో చెలరేగి హ్యాట్రిక్ సాధించినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ అస్సలు తగ్గలేదు. ఓపెనర్ లిజెల్ లీ (54 బంతుల్లో 86), లారా వోల్వార్డ్ (54 బంతుల్లో 86) ముంబై స్టేడియంలో పరుగుల వరద పారించారు. వీరిద్దరి వీరోచిత పోరాటంతో ఢిల్లీ విజయం దిశగా దూసుకుపోయింది. ఒక దశలో ఢిల్లీ ఈజీగా గెలుస్తుందని అందరూ భావించారు. చివరి ఓవర్లో ఢిల్లీ విజయానికి కేవలం 7 పరుగులు మాత్రమే అవసరం. చేతిలో వికెట్లు ఉన్నాయి, క్రీజులో సెట్ అయిన బ్యాటర్ వోల్వార్డ్ ఉంది.. కానీ అక్కడే అసలైన డ్రామా మొదలైంది.
గుజరాత్ కెప్టెన్ నమ్మకంతో బంతిని సోఫీ డివైన్ చేతికి ఇచ్చింది. ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన ఢిల్లీ బ్యాటర్లను సోఫీ తన వేగంతో, తెలివితో కట్టడి చేసింది. ఆ ఓవర్లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చి, 2 కీలక వికెట్లు పడగొట్టి ఢిల్లీ నోటికాడ ముద్దను లాగేసుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 205 పరుగుల వద్ద ఆగిపోయి, 4 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్‌లో 95 పరుగులు, బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో విక్టరీ.. సోఫీ డివైన్ ప్రదర్శన డబ్ల్యూపీఎల్ చరిత్రలో నిలిచిపోయేలా సాగింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..