WPL 2026 Points Table : డబ్ల్యూపీఎల్ పాయింట్స్ టేబుల్ రివర్స్..ముంబై ఇండియన్స్ దెబ్బకు ఆర్సీబీ విలవిల

WPL 2026 Points Table : పాయింట్ల పట్టిక విషయానికి వస్తే, ఓటమి పాలైనప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే, ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది.

WPL 2026 Points Table : డబ్ల్యూపీఎల్ పాయింట్స్ టేబుల్ రివర్స్..ముంబై ఇండియన్స్ దెబ్బకు ఆర్సీబీ విలవిల
Wpl 2026 Points Table

Updated on: Jan 27, 2026 | 9:52 AM

WPL 2026 Points Table : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టిక ఇప్పుడు రసవత్తరంగా మారింది. వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన కీలక పోరులో ముంబై ఇండియన్స్ అద్భుత విజయం సాధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్ ఆశలపై ఒత్తిడి పెంచింది. వరుసగా రెండో ఓటమిని చవిచూసిన బెంగళూరుకు ఈ ఫలితం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నెట్ సైవర్ బ్రంట్ చారిత్రాత్మక సెంచరీతో ముంబై సత్తా చాటగా, పాయింట్ల పట్టికలో ఈక్వేషన్స్ పూర్తిగా మారిపోయాయి.

పాయింట్ల పట్టిక విషయానికి వస్తే.. ఓటమి పాలైనప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. అయితే ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్‌ల్లో 6 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ కూడా చెరో 6 పాయింట్లతో ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ముంబై టాప్-2లో నిలిచింది. యూపీ వారియర్స్ 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. లీగ్ దశ ముగుస్తున్న తరుణంలో టాప్-3లో ఎవరుంటారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన నిర్ణయం తప్పని ముంబై బ్యాటర్లు నిరూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. నెట్ సైవర్ బ్రంట్ 56 బంతుల్లోనే 100 పరుగులు చేసి డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సెంచరీని తన పేరిట లిఖించుకుంది. ఓపెనర్ హేలీ మాథ్యూస్ కూడా 56 పరుగులతో రాణించింది. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు తీసినా, పరుగులను మాత్రం అదుపు చేయలేకపోయింది.

200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన కేవలం 6 పరుగులకే వెనుదిరిగింది. ఆ తర్వాత రిచా ఘోష్ (90 పరుగులు, 10 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఒంటరి పోరాటం చేసింది. నాడిన్ డి క్లర్క్ (28) సహకరించినప్పటికీ, చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ముంబై బౌలింగ్‌లో హేలీ మాథ్యూస్ 3 వికెట్లు పడగొట్టగా, షబ్నిమ్ ఇస్మాయిల్, అమేలియా కెర్ చెరో 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..