WPL 2026 MI vs RCB : ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు…బెంగళూరు టార్గెట్ 155

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో హై డ్రామా నెలకొంది.

WPL 2026 MI vs RCB : ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు...బెంగళూరు టార్గెట్ 155
Wpl 2026 Mi Vs Rcb

Updated on: Jan 09, 2026 | 9:26 PM

WPL 2026 MI vs RCB : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో హై డ్రామా నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది.

మ్యాచ్ ప్రారంభానికి ముందు డీవై పాటిల్ స్టేడియం తారల మెరుపులతో నిండిపోయింది. బాలీవుడ్ నటీమణులు హర్నాజ్ సంధూ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తమ డాన్సులతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ హనీ సింగ్ తన పాపులర్ సాంగ్స్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. ఓపెనింగ్ సెర్మనీ కారణంగా టాస్ సమయాన్ని 15 నిమిషాల ముందుకు జరిపారు.

టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ప్లేయర్ హేలీ మాథ్యూస్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం కావడం ముంబైని దెబ్బతీసింది. ఓపెనర్ అమేలియా కెర్‎ను లారెన్ బెల్ మెయిడిన్ ఓవర్‌తో అవుట్ చేసి ముంబైని ఆత్మరక్షణలో పడేసింది. ఆ తర్వాత నటాలీ స్కివర్ బ్రంట్(4) కూడా త్వరగానే వెనుదిరిగింది.

ఒక దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (20) ఉన్నంతసేపు ధాటిగా ఆడినా ఎక్కువ సేపు నిలవలేకపోయింది. అయితే, సజీవన్ సజనా (24 బంతుల్లో 45), నికోలా కేరీ (27 బంతుల్లో 40) అద్భుత పోరాటం చేశారు. వీరిద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది స్కోరు బోర్డును 150 దాటించారు. చివరి ఓవర్‌లో నాడిన్ డి క్లెర్క్ వీరిద్దరి వికెట్లను తీసి ముంబైని 154 పరుగులకే పరిమితం చేసింది.

ఆర్సీబీ బౌలర్లలో నాడిన్ డి క్లెర్క్ మూడు వికెట్లతో చెలరేగగా, లారెన్ బెల్, శ్రేయాంక పాటిల్, అరుంధతి రెడ్డి తలో వికెట్ తీశారు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగుతున్న బెంగళూరు జట్టులో స్మృతి మంధాన, గ్రేస్ హారిస్ వంటి హిట్టర్లు ఉన్నారు. అయితే ముంబై బౌలింగ్ అటాక్‌లో షబ్నిమ్ ఇస్మాయిల్ లాంటి స్పీడ్ గన్ ఉండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి