
MI vs DC WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ పంజా విసిరింది. శనివారం నవీ ముంబై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మూడో మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి ఏకంగా 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ ప్లేయర్ నేట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో ఢిల్లీ బౌలింగ్‌ను చిత్తు చేశారు. మొదటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఎదురైన ఓటమి కసిని ముంబై ఈ మ్యాచ్‌లో చూపిస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా, ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అమెలియా కెర్ రెండో ఓవర్లోనే ఖాతా తెరవకుండానే అవుట్ అయింది. మరో ఓపెనర్ జీ కమలిని కూడా 16 పరుగులకే వెనుదిరగడంతో ముంబై కష్టాల్లో పడేలా కనిపించింది. పవర్‌ప్లే ముగిసేసరికి ముంబై 43 పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నేట్ సీవర్ బ్రంట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
నేట్ సీవర్ బ్రంట్ మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడింది. కేవలం 32 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్న బ్రంట్, మొత్తం 46 బంతుల్లో 70 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆమె అవుట్ అయిన తర్వాత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరింత ఉగ్రరూపం దాల్చింది. 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన హర్మన్, చివరి వరకు నాటౌట్‌గా నిలిచి 74 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య మూడో వికెట్‌కు నమోదైన 60 పరుగుల పైచిలుకు భాగస్వామ్యం ముంబైని భారీ స్కోరు దిశగా నడిపించింది.
ముంబై బ్యాటర్ల దాడికి ఢిల్లీ బౌలర్లు నిస్సహాయులుగా మారిపోయారు. అయితే ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు తీసి కాస్త పర్వాలేదనిపించింది. మొదటి మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై బ్యాటర్లు 196 పరుగుల పెద్ద టార్గెట్ ఇచ్చారు. షెఫాలీ వర్మ, లారా వోల్వార్డ్ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్న ఢిల్లీ ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..