
Nandini Sharma : మహిళా ప్రీమియర్ లీగ్ 2026లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక యువ బౌలర్ చరిత్రను తిరగరాసింది. కేవలం 24 ఏళ్ల వయసున్న చండీగఢ్ పేసర్ నందిని శర్మ, గుజరాత్ బ్యాటర్లను తన బౌలింగ్‌తో వణికించింది. ఈ సీజన్‌లోనే మొదటి హ్యాట్రిక్ నమోదు చేయడమే కాకుండా, ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అన్ క్యాప్డ్ ప్లేయర్‌గా ఉండి ఈ రేంజ్ ప్రదర్శన చేయడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వరకు సాధారణంగానే సాగింది. కానీ నందిని శర్మ బంతిని చేతబట్టాక సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఓవర్లో ఆమె ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. ముఖ్యంగా చివరి మూడు బంతుల్లో వరుసగా కనికా అహుజా, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్‌లను అవుట్ చేసి అద్భుతమైన హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతకుముందు ప్రమాదకరమైన యాష్లే గార్డనర్, కాష్వీ గౌతమ్‌లను కూడా పెవిలియన్ పంపింది. మొత్తంగా 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా నందిని నిలిచింది. గతంలో ఈ ఘనతను ఇజీ వాంగ్ (ముంబై ఇండియన్స్), గ్రేస్ హారిస్ (యూపీ వారియర్స్), దీప్తి శర్మ (యూపీ వారియర్స్) మాత్రమే సాధించారు. అయితే, 5 వికెట్ల ఘనత సాధించిన మొట్టమొదటి అన్ క్యాప్డ్ బౌలర్‌గా నందిని రికార్డు సృష్టించింది. 2026 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో నందినిని కొనుగోలు చేసింది. నేడు ఆమె చేసిన ప్రదర్శనతో ఆ పెట్టుబడికి వంద రెట్లు న్యాయం చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.
🚨 𝐇𝐚𝐭-𝐭𝐫𝐢𝐜𝐤 𝐀𝐥𝐞𝐫𝐭 🚨
Nandni Sharma, you beauty 👌 #TATAWPL's 4th hat-trick 🫡
Updates ▶️ https://t.co/owLBJyAIzb #TATAWPL | #KhelEmotionKa | #DCvGG | @DelhiCapitals pic.twitter.com/Crnlx2PW5I
— Women's Premier League (WPL) (@wplt20) January 11, 2026
హ్యాట్రిక్ విక్టరీ తర్వాత నందిని మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకుంది. “నా దృష్టంతా సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయడంపైనే ఉంది. ప్రతి బంతికి ముందు షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ నాతో మాట్లాడుతూ నన్ను ఉత్సాహపరిచారు. స్టంప్స్ టార్గెట్‌గా బౌలింగ్ చేయమని వారు చెప్పిన సలహా బాగా పనిచేసింది. నిజానికి నేను హ్యాట్రిక్ వస్తుందని అస్సలు ఊహించలేదు. కానీ వికెట్లు వస్తాయని టీమ్ నమ్మకంగా చెప్పింది. నా మొదటి ఓవర్ తర్వాత బౌలింగ్‌లో చిన్న మార్పులు చేశాను, అదే నాకు ఈ సక్సెస్‌ని ఇచ్చింది” అని నందిని వివరించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..