Womens T20 World Cup 2026 : గతేడాది కంటే 10% పెరిగిన బహుమతి మొత్తం.. వరల్డ్ కప్ గెలిస్తే ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?

Womens T20 World Cup 2026 : మహిళల టీ20 వరల్డ్ కప్ 2026కు ఐసీసీ రికార్డు స్థాయి ప్రైజ్ మనీ ప్రకటించింది. విజేత జట్టుకు రూ.22.13 కోట్లు, రన్నరప్‌కు రూ.11.07 కోట్లు దక్కనున్నాయి. గత టోర్నీతో పోలిస్తే మొత్తం బహుమతి మొత్తాన్ని 10 శాతం పెంచింది.

Womens T20 World Cup 2026 : గతేడాది కంటే 10% పెరిగిన బహుమతి మొత్తం.. వరల్డ్ కప్  గెలిస్తే ఎన్ని కోట్లు వస్తుందో తెలుసా ?
Womens T20 World Cup 2026

Updated on: Jun 30, 2026 | 12:26 PM

Womens T20 World Cup 2026 : మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఐసిసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఉమెన్స్ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ప్రైజ్ మనీని భారీగా పెంచుతూ అధికారిక ప్రకటన చేసింది. ఈసారి మొత్తం ప్రైజ్ పూల్ కింద ఏకంగా 8,764,615 అమెరికన్ డాలర్లను ఐసిసి కేటాయించింది. మన భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.82.88 కోట్లు కావడం విశేషం. టోర్నమెంట్‌లో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్, సెమీఫైనలిస్ట్లు , గ్రూప్ స్టేజ్‌లోనే వెనుతిరిగే జట్లకు కూడా ఈ భారీ బడ్జెట్ నుండి సింహభాగం దక్కనుంది.

విన్నర్, రన్నరప్‌లకు కాసుల పంట

ఈ మెగా టోర్నీలో ఫైనల్ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడే విజేత జట్టుపై పైసల వర్షం కురవనుంది. ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌కు ఐసిసి 2,340,000 అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ.22.13 కోట్ల భారీ ప్రైజ్ మనీని బహుమతిగా ఇవ్వనుంది. అలాగే ఫైనల్ చేరి రన్నరప్‌గా నిలిచే దురదృష్టకర జట్టుకు కూడా తక్కువ మొత్తమేమీ రావడం లేదు. రన్నరప్ జట్టుకు 1,170,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.11.07 కోట్లు) లభించనున్నాయి.

సెమీస్‌లో ఓడినా కోట్ల రూపాయలు

ఫైనల్‌కు చేరలేక సెమీఫైనల్‌లోనే ఇంటిబాట పట్టే జట్లను కూడా ఐసిసి బాగానే గౌరవించనుంది. సెమీస్‌లో ఓడిపోయే రెండు జట్లలో ప్రతి జట్టుకు 675,000 అమెరికన్ డాలర్ల చొప్పున బహుమతి అందుతుంది. దీని విలువ మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.6.38 కోట్లు ఉంటుంది. అంటే ఫైనల్ చేరకపోయినా సరే ఆ రెండు జట్లు కోట్ల రూపాయలతో స్వదేశానికి తిరుగు ప్రయాణం అవుతాయి.

గ్రూప్ స్టేజ్ మ్యాచ్ గెలిచినా బోనస్

కేవలం టోర్నీ చివరలోనే కాకుండా, లీగ్ దశలో ప్రదర్శించే టాలెంటెడ్ జట్టుకు కూడా ఐసిసి ప్రత్యేక నజరానాలను సిద్ధం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ సాధించే ఒక్కో విజయానికి గాను ఆయా జట్లకు 31,154 డాలర్లు (సుమారు రూ.29.47 లక్షలు) అదనంగా లభిస్తాయి. వీటికి తోడు టోర్నమెంట్‌లో పాల్గొనే మొత్తం 12 జట్లకు ఎంట్రీ ఫీజు లేదా పార్టిసిపేషన్ మనీ కింద విడిగా 247,500 డాలర్లు (దాదాపు రూ.2.34 కోట్లు) అందజేస్తారు. అంటే ఒక జట్టు గ్రూప్ స్టేజ్ దాటి ముందుకు వెళ్లలేకపోయినా సరే, కనీసం రెండు కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీని సొంతం చేసుకునే సువర్ణావకాశాన్ని ఐసిసి కల్పించింది.

గత వరల్డ్ కప్ కంటే 10% అదనంగా పెంపు

మహిళల క్రికెట్‌ను పురుషుల క్రికెట్‌తో సమానంగా తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా.. గత 2024 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని ఐసిసి ఏకంగా 10% పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ 2026 లోనే దీనికి సంబంధించిన అధికారిక ఆమోదం లభించింది. ప్రస్తుత టోర్నీ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లాయి. దీంతో ఈ నలుగురిలో రూ.22.13 కోట్ల భారీ ప్రైజ్ మనీని ఏ దేశ మహిళల జట్టు కైవసం చేసుకోబోతోందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us