టీ20 ఫార్మాట్ మజా పూర్తిగా సెపరేట్ అని చెప్పొచ్చు. బౌలర్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడితే.. ప్రేక్షకులకు కావల్సినంత వినోదం దక్కినట్లే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బాష్ లీగ్ 2021 జరుగుతోంది. ఈ టోర్నీ లీగ్ మ్యాచ్‌లు ఇటీవలే పూర్తయ్యాయి. టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన మెల్‌బోర్న్ స్టార్స్, ప్లేఆఫ్స్‌కు చేరిన అడిలైడ్ స్ట్రైకర్స్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ స్టార్ ఓపెనర్ ఎలిస్ విల్లానీ అద్భుత ఇన్నింగ్స్‌తో అలరించింది. విల్లానీతో పాటు, కెప్టెన్, లెజెండరీ బ్యాటర్ మెగ్ లానింగ్ చక్కటి సహకారాన్ని అందించడంతో మెల్‌బోర్న్ స్టార్స్ ఒక్క వికెట్ కోల్పోయి.. అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేధించారు.
ఈ మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయగా.. మొదటి ఓవర్‌లోనే ఓపెనర్ డేన్ వాన్ నీకెర్క్ వికెట్‌ను కోల్పోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఏమాత్రం ప్రభావం చూపించకపోగా.. మరో ఓపెనర్ కేటీ మాక్(89), మడేలిన్ పెన్నా(56) కలిసి నాలుగో వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తరుణంలోనే ఇద్దరూ తమ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని జట్టుకు నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగుల స్కోర్‌ను అందించారు. కేటీ మాక్ 67 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 89 పరుగులతో అజేయంగా నిలవగా.. పెన్నా 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసింది. మెల్‌బోర్న్ బౌలర్లలో సదర్‌ల్యాండ్ రెండు వికెట్లు, గార్త్ ఒక వికెట్ పడగొట్టారు.
అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించడంలో భాగంగా బరిలోకి దిగిన మెల్‌బోర్న్ స్ట్రైకర్స్ జట్టుకు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 14.4 ఓవర్లలో 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ లెన్నింగ్ 39 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఔట్ అయింది. ఆ తర్వాత వచ్చిన అన్నాబెల్ సదర్లాండ్ విల్లానీతో కలిసి అజేయంగా 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చింది.
మెల్‌బోర్న్‌కు చివరి ఓవర్‌లో కేవలం 5 పరుగులు కావాల్సి ఉండగా, విల్లానీ సెంచరీకి 10 పరుగులు చేయాల్సి ఉంది. తొలి బంతిని ఫోర్ కొట్టిన ఆమె.. మూడో బంతిని సిక్స్‌గా మలిచి జట్టును గెలిపించడంతో పాటు సెంచరీని కూడా పూర్తి చేసింది. 65 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో విల్లానీ అజేయంగా 100 పరుగులు చేసింది. అదే సమయంలో, సదర్లాండ్ కేవలం 13 బంతుల్లో 27 పరుగులు చేసింది.