Rajasthan Royals vs Kolkata knight Riders Preview: డిపెండింగ్ ఛాంపియన్ చెన్నైపై ఘన విజయంతో టోర్నీని ఆరంభించింది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR). మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఏకంగా మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలోనూ ఆరోస్థానానికి పడిపోయింది. ఈనేపథ్యంలో మళ్లీ గెలుపుబాట పట్టేందుకు పటిష్ఠమైన రాజస్థాన్ రాయల్స్ (RR)తో పోరుకు సిద్ధమైంది. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. మరో విజయం సాధించి టోర్నీలో ముందుకు అడుగేయాలని శామ్సన్ జట్టు పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ (RR vs KKR) హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
వరుస పరాజయాలతో కేకేఆర్ డీలా..
కేకేఆర్ తిరిగి విజయాల బాట పట్టాలంటే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆ జట్టు మెరుగుపడాల్సి ఉంది. ఆండ్రీ రస్సెల్ మినహా మరే బ్యాటర్ నిలకడగా రాణించలేకపోతున్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆరు మ్యాచ్‌ల్లో 151 పరుగులు మాత్రమే చేశాడు. నితీష్ రానా, వెంకటేష్ అయ్యర్ నిలకడగా పరుగులు చేయలేకపోతున్నాడు. శామ్ బిల్లింగ్స్ పరుగులు చేయడంలో బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (6 మ్యాచ్ ల్లో 10 వికెట్లు) మినహా ఎవరూ అంచనాలు అందుకోవడం లేదు. గత సీజన్‌లో కేకేఆర్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన చక్రవర్తి ఆరు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. సునీల్ నరైన్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. మొదటి మ్యాచ్‌లో బ్యాట్‌తో అదరగొట్టిన ప్యాట్ కమిన్స్ బంతితోనూ సత్తాచాటాల్సి ఉంది.
బలంగానే రాజస్థాన్..
ఇక రాజస్థాన్ జట్టు బలంగా ఉంది. ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో ఆ జట్టు ఆటగాళ్లే (జోస్ బట్లర్, యుజ్వేంద్ర చాహల్) లే ఉన్నారు. చాహల్ ఐదు మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే అనుభవజ్ఞుడైన రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయలేపోతున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన ట్రెంట్ బౌల్ట్ (4 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు)కు జట్టులోని ఇతర బౌలర్లు మంచి మద్దతునిస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో బట్లర్ (ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో 272 పరుగులు), షిమ్రాన్ హెట్మెయర్ (అర్ధ సెంచరీ సహాయంతో 197 పరుగులు) అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే, కెప్టెన్ సంజూ శాంసన్, దేవదత్ పడికల్ కూడా ఫామ్‌ను అందుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
ఇరు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండొచ్చంటే..
రాజస్థాన్ రాయల్స్ : సంజు శాంసన్(కెప్టెన్/కీపర్), జోస్ బట్లర్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
కోల్‌కతా నైట్ రైడర్స్ : శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్,, నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్, రసిఖ్ సలామ్, పాట్ కమిన్స్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
Also Read:JP Nadda: బీజేపీ ఉన్నచోట మిషన్.. కాంగ్రెస్ ఉన్నచోట కమిషన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా
Konaseema Road Accident: ఈస్టర్ వేళ విషాదం.. బ్రతుకులను చిదిమేసిన ఇసుకు లారీ