
Vaishnavi Sharma: భారత మహిళల క్రికెట్‌లో మరో మెరుపు తీగ మెరిసింది. విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 20 ఏళ్ల వైష్ణవి శర్మ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చేతుల మీదుగా ఆమె డెబ్యూ క్యాప్ అందుకుంది.
వైష్ణవి శర్మ పేరు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈ టోర్నీలో ఆమె మొత్తం 17 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మలేషియాపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 5 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయడమే కాకుండా, హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించారు.
అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్సింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన వైష్ణవి, చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకుంది. రవీంద్ర జడేజాను ఆదర్శంగా తీసుకుని తన బౌలింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్న ఆమెను అభిమానులు ‘లేడీ జడేజా’ అని కూడా పిలుస్తుంటారు. డొమెస్టిక్ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టు తరపున ఆడుతూ నిలకడైన ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు.
వైష్ణవి శర్మ ఎడమచేతి వాటం స్లో ఆర్థోడాక్స్ స్పిన్నర్. బంతిని గాలిలో ఫ్లైట్ చేయడం, బ్యాటర్లను తన వైవిధ్యంతో బోల్తా కొట్టించడం ఆమె ప్రత్యేకత. 2025 సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం ఆమెకు సీనియర్ జట్టులో చోటు కల్పించింది.
ముబష్శిర్ ఉస్మానీ (ICC డైరెక్టర్) సమక్షంలో టీమిండియా రన్నరప్ మెడల్స్ అందుకున్న ఉదంతం తర్వాత, నేడు మైదానంలో కొత్త తరం ఆటగాళ్లు సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. జి. కమలినితో పాటు వైష్ణవి శర్మ రాకతో భారత స్పిన్ విభాగం మరింత బలోపేతం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..