Kuldeep Yadav : గెలిచిన ఆనందం లేదు..మైదానంలోనే కుల్దీప్, హార్దిక్ మధ్య రచ్చ..అసలేం జరిగింది?

Kuldeep Yadav : కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ పోరులో టీమిండియా 61 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, మైదానంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 15న జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల మధ్య గొడవ జరగడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.

Kuldeep Yadav : గెలిచిన ఆనందం లేదు..మైదానంలోనే కుల్దీప్, హార్దిక్ మధ్య రచ్చ..అసలేం జరిగింది?
Kuldeep Yadav Vs Hardik Pandya

Updated on: Feb 17, 2026 | 2:56 PM

Kuldeep Yadav : కొలంబో వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ హై వోల్టేజ్ పోరులో టీమిండియా 61 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, మైదానంలో జరిగిన కొన్ని పరిణామాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఫిబ్రవరి 15న జరిగిన ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల మధ్య గొడవ జరగడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ముందుగా హార్దిక్ పాండ్యాతో, ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో వాగ్వాదానికి దిగడం స్టేడియంలో కలకలం రేపింది. గెలుపు సంబరాల్లో మునిగిపోవాల్సిన సమయంలో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ వేశాడు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ వైపు ఒక క్యాచ్ వెళ్ళింది. అయితే కుల్దీప్ ఆ క్యాచ్‌ను అందుకోలేకపోవడమే కాకుండా, ఆ బంతి కాస్తా బౌండరీ లైన్ దాటి సిక్సర్‌గా మారింది. దీంతో బౌలర్ హార్దిక్ పాండ్యా తీవ్ర అసహనానికి లోనయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హార్దిక్ అదే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ కుల్దీప్‌కు సీరియస్ గా సూచనలు ఇస్తున్నట్లు కనిపించాడు. దీనికి కుల్దీప్ కూడా దీటుగానే బదులివ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది. పరిస్థితి చేయి దాటుతుండటంతో రింకూ సింగ్ మధ్యలో వచ్చి హార్దిక్‌ను అక్కడి నుండి తీసుకెళ్లాడు.

అయితే గొడవ అక్కడితో ముగిసిపోలేదు. టీమిండియా విజయం సాధించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేయడానికి రాగా, కుల్దీప్ ఆయనతో కూడా కోపంగా మాట్లాడటం విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. మైదానంలో తన పట్ల తోటి ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు పట్ల కుల్దీప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని అతని ముఖ కవళికలు చూస్తే అర్థమవుతోంది. సాధారణంగా కూల్ గా ఉండే కుల్దీప్ ఇలా సహనం కోల్పోవడం చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో అంతా సవ్యంగానే ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లు అంటేనే ఒత్తిడికి మారుపేరు. ఆ సమయంలో ఆటగాళ్లు అత్యుత్సాహంతో లేదా గెలుపు కసితో ఇలా చిన్న చిన్న గొడవలకు దిగడం సహజమేనని వారు చెబుతున్నారు. అయినప్పటికీ మైదానంలో ఇలాంటి అసభ్యకర ప్రవర్తన లేదా సీరియస్ వాగ్వాదాలు జట్టు ఐక్యతను దెబ్బతీస్తాయని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us