
క్రికెట్ ప్రపంచంలో వీరేంద్ర సెహ్వాగ్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. అతని ఆట చూసినా, పేరు విన్నా అభిమానులకు గూస్‌బమ్స్ వస్తాయి. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఎందరో గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ, సెహ్వాగ్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం అందరికీ. ఫార్మాట్ ఏదైనా బంతి కనిపిస్తే కొట్టేయడమే లక్ష్యంగా బరిలోకి దిగే వీరుడు అతను. అయితే.. సెహ్వాగ్ తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఒక్క బంగ్లాదేశ్‌కు మాత్రం బాగా తెలుసు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగేళ్ల పగను గుండెల్లో మోస్తూ.. బంగ్లాదేశ్‌పై సెహ్వాగ్ ప్రతీకారం తీర్చుకున్నాడు.
అది 2007వ సంవత్సరం. వెస్టిండీస్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియా పాల్గొంది. సెహ్వాగ్ స్వయంగా ఈ జట్టును తాను చూసిన బెస్ట్ టీమ్ అని అభివర్ణించాడు. అయితే, టోర్నీ ఆరంభంలోనే బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో పసికూన లాంటి బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం, టోర్నీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించడం అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఒక్కడే హాఫ్ సెంచరీ సాధించగా, మిగతా జట్టు మొత్తం విఫలమైంది. తర్వాత శ్రీలంకపై ఓటమితో టీమిండియా గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టింది. ఇది భారత క్రికెట్ చరిత్రలో అత్యంత దారుణమైన సంఘటనగా మిగిలిపోయింది. ఈ ఓటమి సెహ్వాగ్‌ను వ్యక్తిగతంగా తీవ్రంగా కలిచివేసింది. శ్రీలంకపై ఓటమి తర్వాత భారత జట్టు రెండు రోజులు వెస్టిండీస్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు, సెహ్వాగ్ తన హోటల్ రూమ్ నుండి బయటకు రాకుండా, ఎవరినీ తన రూమ్‌లోకి రానివ్వకుండా ఒంటరిగా బాధపడ్డాడు. ఆ బాధే ఆ తర్వాత కోపంగా, పగగా మారింది.
2007 ప్రపంచకప్ వైఫల్యం తర్వాత బీసీసీఐ సెహ్వాగ్‌ను జట్టు నుండి తప్పించాలని నిర్ణయించుకుంది. అతని ఫామ్ సరిగా లేదనే విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అనిల్ కుంబ్లే కెప్టెన్‌గా ఉన్న 2007-08 ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో కుంబ్లే పట్టుబట్టడంతో సెహ్వాగ్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కింది. ఆ సిరీస్‌లో సెహ్వాగ్ రాణించి, తన రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 319 పరుగులతో తన రెండో ట్రిపుల్ సెంచరీ సాధించి డెవిల్ ఈజ్ బ్యాక్ అని ప్రపంచానికి చాటిచెప్పాడు. మంచి బంతిని కూడా గౌరవించడం నేర్చుకుని సెహ్వాగ్ 2.0గా తిరిగి వచ్చాడు.
2011 వన్డే ప్రపంచకప్‌కు ముందు, 2010 చివర్లో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ కోసం బంగ్లాదేశ్ పర్యటించింది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లో అగ్గి రాజేశాయి. బంగ్లాదేశ్ ఒక ఆర్డినరీ టీమ్. వాళ్లు కనీసం మా 20 వికెట్లు తీయలేరు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు బంగ్లాదేశ్ అభిమానుల్లో, క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అప్పటి బంగ్లాదేశ్ కోచ్ జామీ సిడాన్స్ సెహ్వాగ్ మైక్‌కు దూరంగా ఉంటే మంచిది అని అన్నాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సిరీస్ కాస్తా యుద్ధంలా మారిపోయింది.
సెహ్వాగ్ చేసిన కామెంట్స్‌తో 2011 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్, భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగడానికి భారీ హైప్ వచ్చింది. ఐసీసీ కూడా దీన్ని ఒక అద్భుతమైన ఓపెనింగ్ మ్యాచ్‌గా ప్రచారం చేసింది. టోర్నీ ఆరంభానికి ముందు మరోసారి మైక్ అందుకున్న సెహ్వాగ్, బంగ్లాదేశ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా నేను 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తాను అని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్‌లో జరిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం టీమిండియాకు సవాలుగా మారింది. అయితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో కలిసి క్రీజ్‌లోకి వచ్చిన వీరేంద్ర సెహ్వాగ్ మొదటి బంతి నుండే తన ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు. షైఫుల్ ఇస్లాం వేసిన తొలి బంతిని బౌండరీకి పంపి, బంగ్లాదేశ్ బౌలర్లకు దడ పుట్టించాడు. ఆరంభం నుంచే విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన సెహ్వాగ్, ఒకవైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో తన స్వైర విహారాన్ని కొనసాగించాడు.
గౌతమ్ గంభీర్ 29 బంతుల్లో 28 పరుగులు చేసి అవుటవ్వగా, విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 140 బంతుల్లో 14 ఫోర్లు, ఆరు సిక్సులతో ఏకంగా 175 పరుగులు చేసి బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు 25 వేల మంది బంగ్లా అభిమానులతో నిండిన మీర్‌పూర్ స్టేడియం నిశ్శబ్దంగా ఉండిపోయింది. టీమిండియా 370 పరుగుల భారీ స్కోరు చేసి, బంగ్లాదేశ్‌ను 283 పరుగులకే పరిమితం చేసింది. ఈ మ్యాచ్‌తో సెహ్వాగ్ నాలుగేళ్లుగా అనుభవించిన బాధకు, అవమానానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. అప్పటి నుండి సెహ్వాగ్ పేరు వింటేనే బంగ్లాదేశ్ క్రికెటర్లు, అభిమానులు ఉలిక్కి పడుతుంటారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి