
Virat Kohli : ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో కింగ్ కోహ్లీ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కివీస్ నిర్దేశించిన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత టాప్ ఆర్డర్ కుప్పకూలిన వేళ, ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 91 బంతుల్లోనే అద్భుత సెంచరీ పూర్తి చేశాడు. ఇది ఇంటర్నేషనల్ వన్డేల్లో 54వ సెంచరీ. ఈ క్రమంలో రికీ పాంటింగ్ పేరిట ఉన్న ఒక చారిత్రాత్మక రికార్డును కోహ్లీ సమం చేశాడు.
భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రోహిత్, గిల్, అయ్యర్, రాహుల్ వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖాయమనుకున్న తరుణంలో విరాట్ కోహ్లీ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. యువ ప్లేయర్ నితీష్ రెడ్డి (53)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించిన కోహ్లీ, ఆ తర్వాత తనదైన శైలిలో గేర్ మార్చి కివీస్ బౌలర్లను చిత్తు చేశాడు. కేవలం 91 బంతుల్లోనే 8 ఫోర్లు, 2 సిక్సర్లతో తన సెంచరీ మార్కును చేరుకుని అభిమానులను ఉర్రూతలూగించాడు.
CENTURY!
A sensational 54th ODI 💯 from @imVkohli 🫡🫡
He is keeping India's hopes alive in this chase.#TeamIndia #INDvNZ #3rdODI @IDFCfirstbank pic.twitter.com/LJkhKSpsVR
— BCCI (@BCCI) January 18, 2026
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు (50+ scores) చేసిన రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ పేరిట ఉంది. పాంటింగ్ 50 ఇన్నింగ్స్‌ల్లో 18 సార్లు ఈ ఘనత సాధించగా, కోహ్లీ నేటి ఇన్నింగ్స్‌తో కేవలం 36 ఇన్నింగ్స్‌ల్లోనే 18వ సారి 50+ స్కోరును నమోదు చేసి పాంటింగ్ సరసన చేరాడు. మరో ఇన్నింగ్స్‌లో గనుక కోహ్లీ హాఫ్ సెంచరీ చేస్తే, ప్రపంచంలోనే కివీస్‌పై అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా అగ్రస్థానానికి చేరుకుంటాడు.
కోహ్లీకి తోడుగా నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ (53) బాది భారత్‌ను రేసులో నిలిపాడు. వీరిద్దరి మధ్య 70 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొనడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. నితీష్ అవుట్ అయిన తర్వాత కూడా కోహ్లీ తగ్గకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ప్రస్తుతం టీమిండియాకు హర్షిత్ రాణా సహకారం అందిస్తున్నాడు. భారత్ గెలవాలంటే చివరి ఓవర్లలో భారీ పరుగులు చేయాల్సి ఉంది. కోహ్లీ క్రీజులో ఉండటమే ఇప్పుడు టీమిండియాకు ఉన్న అతిపెద్ద బలం.