Virat Kohli : వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది

Virat Kohli : విరాట్ కోహ్లీ మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గత ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 677 పరుగులు బాదిన కోహ్లీ, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Virat Kohli : వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
Virat Kohli Century

Updated on: Jan 12, 2026 | 7:38 AM

Virat Kohli : టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గత ఏడు వన్డే ఇన్నింగ్స్‌ల్లోనే 677 పరుగులు బాదిన కోహ్లీ, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. తాజాగా వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. 91 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 93 పరుగులు చేసి అవుట్ అయినప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో ఏకంగా ఐదు చారిత్రాత్మక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ అధిగమించిన తీరు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సచిన్ కంటే వేగంగా 28 వేల పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను కోహ్లీ కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 644 ఇన్నింగ్స్‌ల్లో, కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు. అంటే సచిన్ కంటే 20 ఇన్నింగ్స్‌ల ముందే కోహ్లీ ఈ అరుదైన ఫీట్‌ను నమోదు చేసి మోడ్రన్ డే గ్రేట్ అని మరోసారి నిరూపించుకున్నాడు.

సంగక్కరను వెనక్కి నెట్టి రెండో స్థానానికి

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను విరాట్ (ప్రస్తుతం 28,068 పరుగులు) అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ కంటే ముందు కేవలం సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు) మాత్రమే ఉన్నాడు. ఇదే ఫామ్ కొనసాగితే సచిన్ ఆల్ టైమ్ రికార్డుకు కూడా కోహ్లీ ఎసరు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

గంగూలీ రికార్డు బద్ధలు.. కివీస్‌పై 3 వేలు

భారత్ తరపున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. గంగూలీ 308 వన్డేలు ఆడగా, కోహ్లీకి ఇది 309వ మ్యాచ్. తద్వారా భారత్ తరపున ఐదో అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇవే కాకుండా, న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో 3000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా కూడా కోహ్లీ గుర్తింపు పొందాడు. గతంలో సచిన్, రికీ పాంటింగ్, జో రూట్, జాక్వెస్ కలిస్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

వరుసగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు.. ఇది కోహ్లీ మార్క్

వన్డే క్రికెట్ చరిత్రలో ఒక బ్యాటర్ వరుసగా ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేయడం చాలా అరుదు. అయితే విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇలా చేయడం ఇది ఐదోసారి. ఆస్ట్రేలియాపై మూడో వన్డే నుండి మొదలుపెట్టి, నేటి న్యూజిలాండ్ మ్యాచ్ వరకు కోహ్లీ వరుసగా హాఫ్ సెంచరీలు బాదుతూ అజేయంగా నిలుస్తున్నాడు. కోహ్లీ బ్యాట్ నుండి వస్తున్న ఈ పరుగుల వరద చూస్తుంటే, రాబోయే మ్యాచుల్లో మరిన్ని సెంచరీలు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..