Video : జర్రుంటే చచ్చిపోదును గదరా..జురెల్‎ను కొట్టడానికి చెయ్యి ఎత్తిన జైస్వాల్

Yashasvi Jaiswal : టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ మధ్య మైదానం వెలుపల జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డేకు ముందు ఈ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ప్రాక్టీస్ సెషన్ ముగించుకుని టీమ్ బస్సు ఎక్కుతున్న సమయంలో జైస్వాల్‌ను జురెల్ ఆటపట్టించగా, దానికి జైస్వాల్ స్పందించిన తీరు నెటిజన్లను నవ్విస్తోంది.

Video : జర్రుంటే చచ్చిపోదును గదరా..జురెల్‎ను కొట్టడానికి చెయ్యి ఎత్తిన జైస్వాల్
Yashasvi Jaiswal (2)

Updated on: Jan 18, 2026 | 3:21 PM

Video : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆటగాళ్లంతా ఇండోర్ చేరుకున్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమ్ హోటల్ నుండి బస్సు ఎక్కుతున్న సమయంలో యశస్వి జైస్వాల్ ముందు నడుస్తుండగా, ధ్రువ్ జురెల్ వెనుక నుంచి వచ్చి అతడిని ఏదో అని ఆటపట్టించాడు. జురెల్ చేసిన ఆ చిన్న అల్లరి పనికి జైస్వాల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, సరదాగా కొట్టడానికి చెయ్యి ఎత్తాడు. అంటే జురెల్ ఆ దెబ్బ నుంచి తృటిలో తప్పించుకున్నాడన్నమాట. వీడియోలో వీరిద్దరి ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుండటంతో, ఇది కేవలం ఆటపట్టించుకోవడమే అని స్పష్టమవుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కూడా వీరిద్దరూ కలిసి ఆడటంతో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. జురెల్ వెనుక నుంచి జైస్వాల్‌ను గిచ్చాడో లేక ఏదైనా కామెంట్ చేశాడో తెలియదు కానీ, జైస్వాల్ మాత్రం చంపేస్తా అన్నట్టుగా చెయ్యి చూపించి వార్నింగ్ ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు ఎక్స్‎లో తెగ షేర్లు అవుతోంది.

రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్ మధ్యలో జట్టుకు దూరమవ్వడంతో విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టిన ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. వడోదర వన్డేకు ముందే అతను జట్టుతో చేరాడు. అయితే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవడంతో జురెల్ ఇప్పటికీ తన వన్డే అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. యశస్వి జైస్వాల్ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. టెస్టులు, టీ20ల్లో రెగ్యులర్ ప్లేయర్ అయిన జైస్వాల్‌కు ఈ వన్డే సిరీస్‌లో మాత్రం తుది జట్టులో అవకాశం దక్కలేదు.

సిరీస్ 1-1తో సమం కావడంతో ఇండోర్ వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కివీస్ బ్యాటర్లను తక్కువ పరుగులకే కట్టడి చేసి, సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. మైదానంలో సీరియస్ పోరాటం జరగబోతున్నా, దానికి ముందు ఆటగాళ్లు ఇలా ఒత్తిడి లేకుండా సరదాగా గడపడం జట్టు వాతావరణానికి మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..