
Viral Video : అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ఈ టోర్నమెంట్‌లో అమెరికా తరఫున ఆడిన 17 ఏళ్ల క్రికెటర్ ఉదీష్ సూరి గురించి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. టోర్నమెంట్‌లో భాగంగా భారత్, USA మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉదీష్ సూరి.. భారత బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే, వైభవ్ సూర్యవంశి అప్పటికే భారీగా 171 పరుగులు చేసి ఉండటం గమనార్హం. భారత జట్టుపై ఉదీష్ సూరి 2 వికెట్లు తీయడంతో పాటు, 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 78 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
వైభవ్ సూర్యవంశిని బౌల్డ్ చేసిన ఉదీష్ సూరి తన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ U19, USA U19 జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించిన ఒక వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉదీష్ సూరి బ్యాటింగ్ చేస్తుండగా, గ్యాలరీలో కూర్చున్న అతని తల్లి అతనికి ఏదో సిగ్నల్స్ ఇస్తూ కనిపించింది. సూరి ఒక షాట్ ఆడి సింగిల్ తీసుకోగానే, అతని తల్లి వికెట్‌పై కాస్త సమయం తీసుకుని, నిదానంగా ఆడమని సైగలు చేసింది. అంతేకాకుండా తల్లి తన కొడుక్కి ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చింది. తల్లి, కొడుకు మధ్య జరిగిన ఈ ప్రత్యేక సంభాషణను చూసిన కామెంటేటర్.. “ఆమె కంటే గొప్ప నిపుణులు ఎవరూ ఉండరు” అంటూ ప్రశంసించారు.
వైరల్ అవుతున్న ఈ వీడియో ఉదీష్ సూరి జెర్సీపై ఉన్న లోగోను బట్టి అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు సంబంధించిందేనని తెలుస్తోంది. అయితే, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూరి ప్రదర్శన అంత గొప్పగా లేదు. ఆ మ్యాచ్‌లో అతను 9 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లో మాత్రం 10 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఏది ఏమైనా, టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో, తల్లి కొడుకుల మధ్య ఉన్న ఈ ఆప్యాయమైన క్రికెట్ సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. టోర్నమెంట్ ఫైనల్ డిసెంబర్ 21 న జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..