Rohit Sharma : ఇదయ్యా ఫ్యాన్స్‌కు నీలో తెగ నచ్చేది..ప్రాక్టీస్ సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యం

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో, అభిమానుల విషయంలోనూ అంతే ఆప్యాయత చూపిస్తాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, అభిమానుల పట్ల అతని ప్రేమ ఎక్కడికీ పోలేదు. తాజాగా ముంబైలోని చారిత్రక శివాజీ పార్క్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక చిన్న అభిమానిని కలిసిన తీరు వైరల్ అయ్యింది.

Rohit Sharma : ఇదయ్యా ఫ్యాన్స్‌కు నీలో తెగ నచ్చేది..ప్రాక్టీస్ సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యం
Rohit Sharma (3)

Updated on: Oct 11, 2025 | 6:17 PM

Rohit Sharma : టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో నెట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ, సీనియర్ బ్యాటర్‌గా తన దృష్టిని ఆటపైనే ఉంచాడు. ఈ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుండగా మైదానంలో జరిగిన ఒక చిన్న సంఘటన కారణంగా రోహిత్ మంచితనం, అభిమానుల పట్ల అతని ప్రేమ మరోసారి రుజువైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రాక్టీస్ మధ్యలో, ఒక చిన్నారి అభిమాని తన ఆరాధ్య ఆటగాడైన రోహిత్‌ను కలవాలనే ఉద్దేశంతో భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి వచ్చాడు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు, ఆ పిల్లాడిని అడ్డుకున్నాడు. ఇది చూసిన రోహిత్ శర్మ క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే జోక్యం చేసుకున్నాడు. ఆ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పిల్లాడిని కలవడానికి అనుమతించాలని గట్టిగా చెప్పాడు. ఈ చర్యకు చుట్టూ ఉన్న అభిమానులందరూ గట్టిగా చప్పట్లు కొట్టి రోహిత్‌ను అభినందించారు. ఈ సంఘటన రోహిత్ సౌమ్యమైన స్వభావం అభిమానుల పట్ల దయను తెలియజేసింది.

కెప్టెన్సీ పగ్గాలు శుభ్‌మన్‌ గిల్‌కు అప్పగించినా, సీనియర్ బ్యాటర్‌గా జట్టుకు తన వంతు సహకారం అందించడానికి రోహిత్ శర్మ గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. రోహిత్ దాదాపు రెండు గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. తన బ్యాట్ ఊపుతున్న తీరు చూస్తే, అతను మంచి టచ్‌లో ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. రోహిత్ ఎప్పుడూ ఆడే వింటేజ్ కవర్ డ్రైవ్‌లు, తన ట్రేడ్‌మార్క్ పవర్‌ఫుల్ స్వీప్ షాట్‌లు ఆడటం చూసి అభిమానులు హిట్‌మ్యాన్ అంటూ నినాదాలు చేశారు.

ఈ ప్రాక్టీస్ సెషన్‌లో మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ రోహిత్‌కు సహాయం అందించారు. యువ ముంబై క్రికెటర్ అంగ్‌క్రిష్ రఘువంశి కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా, రోహిత్ భార్య రితికా సజ్దే కూడా పక్కనే ఉండి అతని ప్రాక్టీస్‌ను దగ్గరుండి వీక్షించింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, రోహిత్ తన దృష్టిని ఆటపైనే పూర్తిగా నిలిపాడు. 2027 వన్డే ప్రపంచకప్‌తో సహా భవిష్యత్తు టోర్నమెంట్‌ల కోసం ఫిట్‌గా ఉండేందుకు రోహిత్ తన వెయిట్ భారీగా తగ్గించుకున్నట్లు సమాచారం. రోహిత్, విరాట్ కోహ్లీతో కలిసి ఈ ఏడాది చివర్లో దేశీయ క్రికెట్లో కూడా ఆడే అవకాశం ఉంది. శివాజీ పార్క్‌కు వచ్చిన అభిమానులకు, రోహిత్ బ్యాటింగ్ టెక్నిక్ కంటే, ఆ చిన్నారి అభిమాని పట్ల అతను చూపిన దయ, సౌమ్యమైన స్వభావం ఎక్కువగా గుర్తుండిపోయాయి.

 

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..