Varun Chakravarthy : మిస్టరీ స్పిన్నర్ దెబ్బకు రికార్డులు గల్లంతు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ప్లేస్ వరుణ్ చక్రవర్తిదే

Varun Chakravarthy : టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆకట్టుకుంటున్నాడు. నిలకడగా రాణిస్తున్న అతను, డిసెంబర్ 17న విడుదలైన తాజా ఐసీసీ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ను నమోదు చేసి చరిత్ర సృష్టించాడు.

Varun Chakravarthy : మిస్టరీ స్పిన్నర్ దెబ్బకు రికార్డులు గల్లంతు.. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 ప్లేస్ వరుణ్ చక్రవర్తిదే
Varun Chakravarthy

Updated on: Dec 17, 2025 | 5:18 PM

Varun Chakravarthy : టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన బౌలింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆకట్టుకుంటున్నాడు. నిలకడగా రాణిస్తున్న అతను, డిసెంబర్ 17న విడుదలైన తాజా ఐసీసీ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్‌ను నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. తాజాగా విడుదలైన ఈ జాబితాలో వరుణ్ తన ఖాతాలో 36 రేటింగ్ పాయింట్లను జోడించుకుని, మొత్తం 818 కెరీర్ బెస్ట్ పాయింట్లను సాధించాడు. గత వారం సౌతాఫ్రికాతో జరిగిన రెండు టి20 మ్యాచ్‌లలో ఒక్కో మ్యాచ్‌లో రెండేసి వికెట్లు (మొత్తం 4 వికెట్లు) తీయడం అతను ఈ ఘనత సాధించడానికి దోహదపడింది.

818 రేటింగ్ పాయింట్లతో వరుణ్ చక్రవర్తి ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పురుషుల టి20 క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన టాప్-10 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ బౌలర్‌గా వరుణ్ నిలిచాడు. ఈ ఆల్-టైమ్ బెస్ట్ రేటింగ్స్ జాబితాలో అతను ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్ 865 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉండగా, వరుణ్ తన ప్రదర్శనతో తబ్రేజ్ షమ్సీ (827), రషీద్ ఖాన్ (828), సునీల్ నరైన్ (832) వంటి దిగ్గజాల సరసన నిలిచాడు. అంతేకాకుండా పాకిస్తాన్ స్టార్ షాదాబ్ ఖాన్ (811), శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా (809) కంటే మెరుగైన రేటింగ్‌ను వరుణ్ సొంతం చేసుకున్నాడు.

పురుషుల టి20ఐ క్రికెట్ చరిత్రలో అత్యధిక రేటింగ్ సాధించిన టాప్-10 బౌలర్ల జాబితా ఇదే

ఉమర్ గుల్ (పాకిస్తాన్) – 865 రేటింగ్

శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్) – 864 రేటింగ్

డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్) – 858 రేటింగ్

సునీల్ నరైన్ (వెస్టిండీస్) – 832 రేటింగ్

రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్) – 828 రేటింగ్

తబ్రేజ్ షమ్సీ (దక్షిణ ఆఫ్రికా) – 827 రేటింగ్

షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 822 రేటింగ్

వరుణ్ చక్రవర్తి (భారత్) – 818 రేటింగ్

షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్) – 811 రేటింగ్

వనిందు హసరంగా (శ్రీలంక) – 809 రేటింగ్

వరుణ్ చక్రవర్తి ఇప్పుడు తన తదుపరి లక్ష్యంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సాధించిన 822 రేటింగ్ పాయింట్లపై దృష్టి సారించాడు. ఈ వారంలో జరగబోయే మ్యాచ్‌లలో గనుక అతను మెరుగైన ప్రదర్శన కొనసాగిస్తే, అఫ్రిదిని అధిగమించి ఆల్-టైమ్ టాప్-10 జాబితాలో 7వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుత ఐసీసీ టి20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరుణ్ 818 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, రెండవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ (699) కంటే 119 పాయింట్ల భారీ ఆధిక్యంలో ఉన్నాడు. ప్రస్తుతం టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఉన్న ఏకైక భారతీయ బౌలర్ వరుణ్ మాత్రమే కాగా, సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమైన అక్షర్ పటేల్ 636 రేటింగ్‌తో 13వ స్థానంలో కొనసాగుతున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..