Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువ..63 బంతుల్లోనే సెంచరీ

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి సౌతాఫ్రికాలో ఇది మొట్టమొదటి పర్యటన. కొత్త వాతావరణం, పిచ్‌ల స్వభావం తెలియకపోయినా.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. ఈ టూర్‌లో ఆడిన మూడు వన్డేల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో కలిపి మొత్తం 206 పరుగులు చేశాడు.

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..ఫోర్ల కంటే సిక్సర్లే ఎక్కువ..63 బంతుల్లోనే సెంచరీ
Vaibhav Suryavanshi

Updated on: Jan 07, 2026 | 3:51 PM

Vaibhav Suryavanshi : టీమిండియా అండర్-19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్ పవర్‌తో సౌతాఫ్రికా గడ్డపై ప్రకంపనలు సృష్టించాడు. సాధారణంగా సెంచరీలు అంటే ఫోర్లతో నిండి ఉంటాయి, కానీ వైభవ్ ఇన్నింగ్స్ మాత్రం సిక్సర్లతో హోరెత్తింది. కేవలం 63 బంతుల్లోనే 8 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో వైభవ్ తన సెంచరీని పూర్తి చేశాడు. మొత్తం 127 పరుగుల ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 9 ఫోర్లు బాదాడు. అంటే అతడు చేసిన పరుగులలో సగానికి పైగా సిక్సర్ల ద్వారానే రావడం విశేషం. ఇది అతడి అండర్-19 వన్డే కెరీర్‌లో మూడవ సెంచరీ. గతంలో ఇంగ్లండ్, యూఏఈ జట్లపై కూడా వైభవ్ శతకాలు బాదాడు.

వైభవ్ సూర్యవంశీకి సౌతాఫ్రికాలో ఇది మొట్టమొదటి పర్యటన. కొత్త వాతావరణం, పిచ్‌ల స్వభావం తెలియకపోయినా.. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. ఈ టూర్‌లో ఆడిన మూడు వన్డేల్లో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో కలిపి మొత్తం 206 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి బ్యాటింగ్ సగటు 103గా ఉండటం చూస్తుంటే, వైభవ్ ఎంతటి భీకరమైన ఫామ్‌లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కప్‌కు ముందు కెప్టెన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

జనవరి 15 నుంచి అండర్-19 వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ జింబాబ్వే, నమీబియా దేశాల్లో జరగనుంది. ఆ దేశాల్లో కూడా సౌతాఫ్రికా ఉన్నటువంటి పిచ్ పరిస్థితులే ఉంటాయి. కాబట్టి ఆఫ్రికా ఖండంలో వైభవ్ బ్యాట్ ఇలాగే గర్జిస్తే, భారత్ మరోసారి ప్రపంచ విజేతగా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైభవ్ బ్యాటింగ్ శైలి చూస్తుంటే సీనియర్ జట్టులోని సూర్యకుమార్ యాదవ్ లేదా యువరాజ్ సింగ్‌ను తలపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డే కెరీర్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 18 మ్యాచ్‌ల్లో 57 సగటుతో 973 పరుగులు చేశాడు. తన కెరీర్‌లో 1000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతడు కేవలం 27 పరుగుల దూరంలో ఉన్నాడు. వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లోనే వైభవ్ ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది. కేవలం 14 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించిన వైభవ్, ఇప్పుడు టీమిండియా భవిష్యత్తు స్టార్‌గా ఎదుగుతున్నాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి