
Vaibhav Suryavanshi : అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైనప్పటికీ, ఆ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఒక అద్భుతమైన ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ, సౌతాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేశాడు. మల్టీ నేషన్ అండర్-19 టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. 2022 అండర్-19 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ (బేబీ ఏబీ) 18 సిక్సర్లు కొట్టి ఈ రికార్డు సృష్టించగా.. తాజా ఆసియా కప్‌లో వైభవ్ ఏకంగా 20 సిక్సర్లు బాది అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ టోర్నీలో పాకిస్థాన్ ఆటగాడు సమీర్ మిన్హాజ్ కూడా 19 సిక్సర్లతో బ్రెవిస్‌ను దాటగా, వైభవ్ అతడిని కూడా వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఈ ఆసియా కప్‌లో వైభవ్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 52.20 సగటుతో 261 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 182.51గా ఉండటం విశేషం. ముఖ్యంగా యూఏఈ పై ఆడిన 171 పరుగుల ఇన్నింగ్స్‌లో అతను 14 సిక్సర్లు బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ 191 పరుగుల భారీ తేడాతో ఓడిపోయినప్పటికీ, వైభవ్ మాత్రం 10 బంతుల్లోనే 3 సిక్సర్లతో 26 పరుగులు చేసి తన మార్కును చాటుకున్నాడు.
యుత్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా ఇప్పుడు వైభవ్ పేరు మీదనే ఉంది. మొత్తం 60 సిక్సర్లతో అతను అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గతంలో భారత మాజీ అండర్-19 కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ 38 సిక్సర్లతో ఉన్న రికార్డును వైభవ్ చాలా సునాయాసంగా దాటేశాడు. ఈ ఏడాదిలోనే వైభవ్ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేయడం, అలాగే సీనియర్ స్థాయిలో టీ20 సెంచరీలు బాదడం వంటి అరుదైన ఘనతలు సాధించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..