
Vaibhav Suryavanshi : బీహార్ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దేశవాళీ క్రికెట్‌లో మరోసారి చరిత్ర సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును కేవలం 10 బంతుల తేడాతో బద్దలు కొట్టాడు. రాంచీలోని జేఎస్‌సీఏ ఓవల్ మైదానంలో అరుణాచల్ ప్రదేశ్‌పై వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 15 భారీ సిక్సర్లు ఉన్నాయి. 226 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్, కేవలం 36 బంతుల్లోనే తన సెంచరీ పూర్తి చేశాడు. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డులకు ఎక్కింది. కొద్దిలో డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ, అతను సృష్టించిన ప్రభంజనం మాత్రం మామూలుగా లేదు.
లిస్ట్-ఏ క్రికెట్‌లో అతివేగంగా 150 పరుగుల మార్కును అందుకున్న ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. డివిలియర్స్ 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై 64 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. అయితే, వైభవ్ కేవలం 54 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకుని, డివిలియర్స్ కంటే 10 బంతులు తక్కువ ఆడి ఈ వరల్డ్ రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
కేవలం 14 ఏళ్ల 272 రోజుల వయసులోనే లిస్ట్-ఏ క్రికెట్‌లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఏ ప్రొఫెషనల్ వన్డే టోర్నీలోనూ ఇంత చిన్న వయసులో ఎవరూ సెంచరీ చేయలేదు. ఇటీవలే ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇతడిని భారీ ధరకు కొనుగోలు చేయగా, ఈ ఇన్నింగ్స్‌తో తానెందుకు స్పెషలో వైభవ్ మరోసారి నిరూపించుకున్నాడు. అండర్-19 ఆసియా కప్ ఓటమి బాధ నుంచి త్వరగానే కోలుకుని, సీనియర్ స్థాయిలో ఈ అద్భుత ప్రదర్శన చేయడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..