‘ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ పిచ్‌లు ఉండవురా బాబూ’.. వైభవ్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు!

అంతర్జాతీయ వేదికపై తొలి మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన వైభవ్ సూర్యవంశీ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. కేవలం 15 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ లాంటి కఠినమైన పిచ్‌లపై, ఆర్చర్ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం ఏమాత్రం సాధారణ విషయం కాదు.

ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ పిచ్‌లు ఉండవురా బాబూ.. వైభవ్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్న నెటిజన్లు!
Fans Turn Against Vaibhav Sooryavanshi

Updated on: Jul 04, 2026 | 9:16 PM

అద్భుతమైన ఐపీఎల్ ఫామ్‌తో, ఎన్నో భారీ అంచనాల నడుమ భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఈ కుర్రాడు దారుణంగా విఫలమయ్యాడు. దీంతో నెట్టింట భారత అభిమానులు అతడిపై విమర్శల వర్షం కురిపిస్తూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.

ఆరంభం అదుర్స్.. ముగింపు బెదుర్స్..!

మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. సీనియర్ ఆటగాడు, వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ సభ్యుడు సంజూ శాంసన్‌ను పక్కనపెట్టి మరీ టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ 15 ఏళ్ల కుర్రాడికి ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్.. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయాడు. క్రీజులో ఎదుర్కొన్నది 10 బంతులే అయినా అందులో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి, పార్ట్ టైమ్ స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కు చిక్కి స్టంపౌట్ అయ్యాడు. ఎంతో ఉత్కంఠగా అతడి బ్యాటింగ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ఈ ప్రదర్శన తీవ్ర నిరాశను మిగిల్చింది.

ఇవి కూడా చదవండి

సచిన్ రికార్డు బద్దలు.. కానీ ప్రదర్శన నిరాశ!

ఈ మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ ఒక అరుదైన చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయసులో బరిలోకి దిగి, అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. 1989లో పాకిస్థాన్‌పై అరంగేట్రం చేసి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అయితే, రికార్డుల పరంగా సచిన్‌ను దాటేసినా, మైదానంలో మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శల పాలయ్యాడు.

ఐపీఎల్ పిచ్‌లు కావాలా తమ్ముడూ..?


ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వరద పారించి ఏకంగా ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ.. ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం తేలిపోయాడు. దీంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతడిని ఆటాడుకుంటున్నారు. “ఇంగ్లాండ్‌లో ఐపీఎల్ తరహాలో ఉండే ఫ్లాట్ పిచ్‌లు ఉండవు తమ్ముడూ.. ఇక్కడ బంతి స్వింగ్ అవుతుంది, పరుగులు చేయడం అంత సులువు కాదు” అంటూ ఘాటుగా కామెంట్లు పెడుతున్నారు. “కేవలం ఒక అద్భుతమైన ఐపీఎల్ సీజన్ చూసి, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజాలతో పోల్చడం మానేయాలి” అని మరికొందరు విమర్శిస్తున్నారు.

భగ్గుమంటున్న సంజూ ఫ్యాన్స్..


మరోవైపు సంజూ శాంసన్ అభిమానులు సైతం టీమిండియా మేనేజ్‌మెంట్ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ గెలిచిన జట్టులో సభ్యుడైన ఒక అద్భుతమైన వికెట్ కీపర్ బ్యాటర్‌ను పక్కనపెట్టి, కేవలం ఒక ఐపీఎల్ సీజన్ ఆడిన కుర్రాడికి ఎలా అవకాశం ఇస్తారంటూ నెట్టింట బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. “వైభవ్ అవుటైన తీరు చూసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చున్న సంజూ శాంసన్ నవ్వుకుంటూ ఉంటాడు” అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

ఆదుకున్న అభిషేక్ శర్మ..


మ్యాచ్ విషయానికొస్తే.. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ భారత జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 24 బంతుల్లోనే 43 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే కీలక సమయంలో శివమ్ దూబే (5) సామ్ కర్రన్ బౌలింగ్‌లో ఔటవడంతో భారత్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

అంతర్జాతీయ వేదికపై తొలి మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన వైభవ్ సూర్యవంశీ ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. కేవలం 15 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ లాంటి కఠినమైన పిచ్‌లపై, ఆర్చర్ లాంటి ప్రపంచ స్థాయి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం ఏమాత్రం సాధారణ విషయం కాదు. ఈ విమర్శలను పక్కనపెట్టి, తన తొలి ఇన్నింగ్స్ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని వైభవ్ సూర్యవంశీ రాబోయే మ్యాచుల్లో ఎలా పుంజుకుంటాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us