చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కోహ్లీ, పంత్ రికార్డ్ బ్రేక్.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ఫామ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 16 బంతుల్లో 36 పరుగులు చేసిన ఈ 15 ఏళ్ల కుర్రాడు, సిక్సర్ల విషయంలో దిగ్గజ బ్యాటర్లకు కూడా సాధ్యం కాని రీతిలో అరుదైన ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. కోహ్లీ, పంత్ రికార్డ్ బ్రేక్.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు
Vaibhav Suryavanshi

Updated on: May 10, 2026 | 5:23 PM

టీ20 క్రికెట్ చరిత్రలో 20 ఏళ్ల వయస్సు రాకముందే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ రెహ్మానుల్లా గుర్బాజ్‌ను వెనక్కి నెట్టాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని అందుకున్న ప్రపంచపు మొట్టమొదటి బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో గుర్బాజ్ (90 సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (73), ఇషాన్ కిషన్ (53) వంటి ఆటగాళ్లు వైభవ్ కంటే చాలా వెనుకబడి ఉన్నారు.

పోలార్డ్ రికార్డు బద్దలు.. అత్యంత వేగంగా సెంచరీ సిక్సర్లు..

బంతుల పరంగా చూస్తే అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా వైభవ్ సరికొత్త చరిత్ర లిఖించాడు. వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్‌ను కూడా అతను అధిగమించడం విశేషం.

వైభవ్ సూర్యవంశీ: 515 బంతుల్లో 100 సిక్సర్లు.

కరన్‌బీర్ సింగ్: 813 బంతుల్లో 100 సిక్సర్లు.

కీరన్ పోలార్డ్: 843 బంతుల్లో 100 సిక్సర్లు.

మొహమ్మద్ సిరాజ్ వేసిన ఓవర్లో సిక్సర్ బాదడం ద్వారా వైభవ్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇది అతడి దూకుడుకు నిదర్శనం.

ఐపీఎల్ సీజన్‌లో సిక్సర్ల వేట: కోహ్లీ, పంత్ రికార్డులు కనుమరుగు..

ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను 40 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ వంటి సీనియర్ల రికార్డులను బద్దలు కొట్టాడు. ప్రస్తుతం అభిషేక్ శర్మ (42 సిక్సర్లు) మొదటి స్థానంలో ఉండగా, వైభవ్ మరో మూడు సిక్సర్లు బాదితే అగ్రస్థానానికి చేరుకుంటాడు. రాజస్థాన్ జట్టుకు ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉండటంతో ఈ రికార్డు కూడా వైభవ్ వశం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

భవిష్యత్ సూపర్ స్టార్‌గా వైభవ్..

చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో, పవర్‌తో బ్యాటింగ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీని చూసి క్రికెట్ ప్రపంచం ముక్కున వేలేసుకుంటోంది. రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న ఈ ఆణిముత్యం భవిష్యత్తులో భారత జట్టుకు వెన్నెముకగా మారుతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ నలుమూలల సిక్సర్లు బాదగల సామర్థ్యం ఉండటంతో అతడిని తదుపరి ‘యూనివర్సల్ బాస్’ అని అభిమానులు కొనియాడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us