
Team India : న్యూజిలాండ్‌తో మిగిలిన రెండు వన్డేల కోసం భారత సెలక్షన్ కమిటీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. గాయం కారణంగా దూరమైన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఢిల్లీ కుర్రాడు ఆయుష్ బదోనీని జట్టులోకి పిలిచింది. అయితే ఈ ఎంపికపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో కనీసం 1000 పరుగులు కూడా చేయని ఆటగాడికి జాతీయ జట్టులో చోటు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆకాష్ చోప్రా స్పందిస్తూ.. ఇది ఒక అన్‌పాపులర్ ఛాయిస్ అని కుండబద్దలు కొట్టారు.
వాషింగ్టన్ సుందర్ లాంటి ఆఫ్ స్పిన్ వేస్తూ బ్యాటింగ్ చేయగల ఆటగాడు అందుబాటులో లేకపోవడంతో, సెలక్టర్లు బదోనీ వైపు మొగ్గు చూపారు. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో బదోనీ బ్యాట్‌తో పెద్దగా రాణించకపోయినా (మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 15 పరుగులు), బౌలింగ్‌లో మాత్రం ఆకట్టుకుంటున్నాడు. రైల్వేస్‌పై 3/30, సర్వీసెస్‌పై 1/28 వంటి పొదుపైన గణాంకాలతో ఆకట్టుకున్నాడు. అందుకే సుందర్‌కు సరైన ప్రత్యామ్నాయం దొరకని పరిస్థితుల్లో సెలక్టర్లు ఈ రిస్క్ తీసుకున్నారని ఆకాష్ చోప్రా విశ్లేషించారు.
చాలామంది అభిమానులు రియాన్ పరాగ్ లేదా రింకూ సింగ్‌లను ఎందుకు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఆకాష్ చోప్రా సమాధానమిస్తూ.. రియాన్ పరాగ్ సుదీర్ఘ గాయం తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అతడిని వెంటనే వన్డేల్లోకి దించడం రిస్క్ అని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. ఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. అతను ప్రధానంగా బ్యాటర్, అప్పుడప్పుడు బౌలింగ్ చేస్తాడు. కానీ టీమిండియాకు ఇప్పుడు సుందర్ లాగా కచ్చితంగా 10 ఓవర్ల స్పెల్ వేయగల లేదా ఉపయోగపడే బౌలర్ కావాలి. అందుకే రింకూ కంటే బదోనీకే ప్రాధాన్యత లభించింది.
27 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన బదోనీ ఇప్పటివరకు 693 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 18 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు (4.54) చాలా బాగుండటం అతనికి ప్లస్ పాయింట్ అయ్యింది. గతేడాది ఇండియా-ఏ తరపున సౌతాఫ్రికా పర్యటనలోనూ 66 పరుగులతో రాణించాడు. గణాంకాలు భారీగా లేకపోయినా, అతనిలోని యుటిలిటీని చూసి సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ సర్ ప్రైజ్ పిలుపును బదోనీ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..