Watch : కళ్లు దొబ్బాయా అంపైర్ జీ.. చెత్త నిర్ణయంతో చిర్రెత్తిన బ్యాటర్ ఏం చేశాడంటే..

Watch : అమెరికాతో జరిగిన ఐసీసీ లీగ్-2 మ్యాచ్‌లో నేపాల్ కెప్టెన్ రోహిత్ పౌడెల్ విచిత్రమైన రీతిలో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంపైర్ తప్పుడు నిర్ణయంపై కోపం ప్రదర్శించినందుకు అతను ఐసీసీ శిక్షకు గురయ్యే అవకాశం ఉంది. బంతి అతని ప్యాడ్లకు అస్సలు తగలలేదు, పైగా స్పష్టంగా గ్లోవ్స్‌కు తగిలింది.

Watch : కళ్లు దొబ్బాయా అంపైర్ జీ.. చెత్త నిర్ణయంతో చిర్రెత్తిన బ్యాటర్ ఏం చేశాడంటే..
Umpiring Blunder In Cwc League

Updated on: May 26, 2026 | 10:39 AM

Watch : ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2 టోర్నమెంట్‌లో భాగంగా అమెరికా (USA), నేపాల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కీర్తీపూర్‌లోని త్రిభువన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ రోహిత్ పౌడెల్ అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైపోయాడు. మ్యాచ్ 38వ ఓవర్ చివరి బంతికి యూఎస్ఏ బౌలర్ మిలింద్ కుమార్ వేసిన బంతిని రోహిత్ స్వీప్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో బంతి అతని ప్యాడ్లకు అస్సలు తగలలేదు, పైగా స్పష్టంగా గ్లోవ్స్‌కు తగిలింది. కానీ, అంపైర్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ఎల్బీడబ్ల్యూ (LBW) కింద ఔట్ ఇచ్చేశాడు.

కోపంతో ఊగిపోయిన కెప్టెన్

అంపైర్ ఇచ్చిన బ్లైండ్ డెసిషన్ చూసి రోహిత్ పౌడెల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తాను నాటౌట్ అని, బంతి గ్లోవ్స్‌కు తగిలిందని అంపైర్‌కు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తీవ్ర కోపంతో ఊగిపోయిన రోహిత్ మైదానంలోనే తన బ్యాట్‌ను గట్టిగా గుద్ది నిరసన వ్యక్తం చేశాడు. సాధారణంగా అంపైర్ నిర్ణయం తర్వాత ఆటగాళ్లు మైదానంలో అసభ్య పదజాలం వాడటం, కిట్ విసిరేయడం లేదా బ్యాట్‌తో కొట్టడం వంటివి చేస్తే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ (లెవెల్ 1 లేదా లెవెల్ 2) నిబంధనల ప్రకారం క్రమశిక్షణా ఉల్లంఘన కింద పరిగణిస్తారు. దీంతో రోహిత్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్‌ను వణికించిన నేపాల్

రోహిత్ పౌడెల్ నేపాల్ క్రికెట్‌లో అత్యంత కీలకమైన ఆటగాడు. ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2026లో అతని కెప్టెన్సీలోనే నేపాల్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో బలమైన ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నేపాల్ గెలిచినంత పనిచేసింది. చివరి నిమిషం వరకు పోరాడి కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. అసోసియేట్ దేశమైనప్పటికీ టెస్ట్ హోదా ఉన్న దేశాలకు దీటుగా నేపాల్ జట్టు ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.

ఇదే టోర్నీ సందర్భంగా రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, పెద్ద జట్లకు ఒక కీలక విజ్ఞప్తి చేశాడు. “మాకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా వంటి పెద్ద జట్లతో ఏడాదికి కనీసం ఒకటి లేదా రెండు సిరీస్‌లు ఆడే అవకాశం కల్పిస్తే మా టాలెంటును నిరూపించుకుంటాం. ఈ వరల్డ్ కప్ తర్వాత అయినా పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ జట్లు నేపాల్ పర్యటనకు వస్తే మా దేశానికి, ఇక్కడి క్రికెట్‌కు అది ఎంతో మేలు చేస్తుంది” అని రోహిత్ పౌడెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us