
U19 World Cup 2026: క్రికెట్ ప్రపంచంలో తదుపరి సూపర్ స్టార్లను పరిచయం చేసే అండర్-19 వరల్డ్ కప్ 2026 సందడి మొదలైపోయింది. జింబాబ్వే, నమీబియా వేదికలుగా రేపటి నుంచే (జనవరి 15) ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న జరిగే ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగుస్తుంది. మొత్తం 16 దేశాలు నాలుగు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా, ఈసారి ఎలాగైనా ఆరోసారి కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉంది.
భారత జట్టు గ్రూప్-Aలో చోటు దక్కించుకుంది. భారత్తో పాటు యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఈ గ్రూపులో ఉన్నాయి. టోర్నీ ఆరంభ రోజైన జనవరి 15నే భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. తొలి పోరులో అమెరికాతో తలపడనుంది. జింబాబ్వేలోని బులవాయో వేదికగా మధ్యాహ్నం 1 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
ఈసారి భారత జట్టులో అత్యంత ఆకర్షణీయమైన ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. అతి చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్‌లో రికార్డులు సృష్టించిన ఈ యువ సంచలనంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో కూడా అదరగొట్టిన వైభవ్, వరల్డ్ కప్‌లో భారత్‌కు ప్రధాన బలం కానున్నాడు. ఆయూష్ మాత్రే సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ యువ జట్టులో కిషన్ కుమార్ సింగ్, మహ్మద్ ఏనాన్ వంటి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. గతేడాది ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
గ్రూపుల వివరాలు ఇలా ఉన్నాయి
గ్రూప్ A: భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, USA.
గ్రూప్ B: పాకిస్థాన్, ఇంగ్లాండ్, జింబాబ్వే, స్కాట్లాండ్.
గ్రూప్ C: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జపాన్.
గ్రూప్ D: సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, టాంజానియా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..