
U19 World Cup 2026: ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత యువ జట్టు విజయ యాత్ర కొనసాగిస్తోంది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఆయుష్ కెప్టెన్సీలోని టీమిండియా 18 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సూపర్-6 దశకు చేరుకుంది. ఈ టోర్నీలో సూపర్-6కు అర్హత సాధించిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో అమెరికాను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్, ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్-బిలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు తలపడుతున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించగా, ప్రతి గ్రూపు నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-6కు వెళ్తాయి. ప్రస్తుతం భారత్ ఉన్న గ్రూప్-బిలో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉండగా, అమెరికా మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచ్‌లో ఓడిపోయి చివరి స్థానంలో ఉంది. భారత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకోవడం విశేషం.
మిగిలిన గ్రూపుల విషయానికి వస్తే.. గ్రూప్-ఏలో శ్రీలంక, గ్రూప్-సిలో ఇంగ్లండ్, గ్రూప్-డిలో ఆఫ్ఘనిస్తాన్ తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. ఆశ్చర్యకరంగా గ్రూప్-డిలో బలమైన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల కంటే ఆఫ్ఘనిస్తాన్ ముందంజలో ఉంది. పాకిస్తాన్ గ్రూప్-సిలో ఇంగ్లండ్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత జట్టు తదుపరి మ్యాచ్‌లలో ఇదే ఫామ్ కొనసాగిస్తే, ఆరోసారి టైటిల్ గెలవడం కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..