Rinku Singh : తండ్రి పాడె మోసిన టీమిండియా స్టార్..కన్నీరుమున్నీరైన రింకూ సింగ్

Rinku Singh : భారత క్రికెట్ సంచలనం, టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రిని ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడిన రింకూ సింగ్ కల నెరవేరకుండానే, అతని తండ్రి ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూశారు.

Rinku Singh : తండ్రి పాడె మోసిన టీమిండియా స్టార్..కన్నీరుమున్నీరైన రింకూ సింగ్
Rinku Singh

Updated on: Feb 27, 2026 | 6:45 PM

Rinku Singh : భారత క్రికెట్ సంచలనం, టీమిండియా స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తన తండ్రిని ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడిన రింకూ కల నెరవేరకుండానే, అతని తండ్రి ఖాన్‌చంద్ సింగ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ (నాల్గవ స్టేజ్)తో పోరాడుతున్న ఆయన ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2026 కోసం చెన్నైలో ఉన్న రింకూ సింగ్, ఈ వార్త తెలియగానే హుటాహుటిన తన స్వగ్రామమైన అలీగఢ్‌కు చేరుకున్నారు.

రింకూ సింగ్ తండ్రి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం అలీగఢ్‌లో అత్యంత విషాదకర వాతావరణంలో జరిగాయి. తన తండ్రి పార్థివ దేహాన్ని చూసి రింకూ కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి పాడెను రింకూ స్వయంగా భుజాన మోయడం అక్కడ ఉన్న వారందరినీ కలిచివేసింది. రింకూ పెద్దన్న సోనూ సింగ్ తండ్రి చితికి నిప్పంటించారు. ఈ అంతిమ యాత్రలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు రింకూ సింగ్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ఖాన్‌చంద్ సింగ్‌కు నివాళులర్పించారు. పేదరికంలో ఉన్నా కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు ఆయన పడిన కష్టం అందరికీ తెలిసిందే.

వాస్తవానికి ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌కు ముందే తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో రింకూ చెన్నై నుంచి నోయిడాకు వచ్చారు. అయితే తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడిందని తెలియడంతో తిరిగి జట్టుతో చేరారు. కానీ, మరుసటి రోజే విధి వంచించింది. జింబాబ్వే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించినా, ఆ సంతోషం రింకూ ఇంట్లో ఒక్క రోజు కూడా నిలవలేదు. వరల్డ్ కప్ గెలిచి తండ్రికి కానుకగా ఇవ్వాలని రింకూ ఆశపడినా, ఆ విజయాన్ని చూసేందుకు తండ్రి లేకపోవడం క్రికెట్ ప్రేమికులందరినీ బాధకు గురిచేస్తోంది.

రింకూ తండ్రి మరణవార్త విన్న క్రికెట్ లోకం దిగ్భ్రాంతికి గురైంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతూ.. “రింకూ, మీ నాన్న మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఈ క్లిష్ట సమయంలో నీకు, నీ కుటుంబానికి నా ప్రార్థనలు తోడుగా ఉంటాయి. ఆయన ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ బలాన్ని ఇస్తాయి” అని రాసుకొచ్చారు. యువరాజ్ సింగ్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా రింకూ సింగ్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్టాల్లో ఉన్న రింకూ సింగ్‌కు అండగా ఉంటామని క్రీడా ప్రపంచం భరోసా ఇచ్చింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us