
Wicket Keeper : క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్ర చాలా కీలకం. వికెట్ వెనుక ఉండి మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల శక్తి వారికి ఉంది. కొన్నిసార్లు ఒక అద్భుతమైన క్యాచ్ లేదా మెరుపు వేగంతో చేసే స్టంపింగ్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ల గురించి మాట్లాడితే, ముందుగా గుర్తుకు వచ్చే పేరు మార్క్ బౌచర్. ప్రపంచంలోనే అత్యధిక క్యాచ్‌లు, స్టంపింగ్‌లు చేసి రికార్డు సృష్టించాడు. ఇక్కడ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఐదుగురు వికెట్ కీపర్ల జాబితా ఉంది.
క్రికెట్ చరిత్రలోని టాప్-5 వికెట్ కీపర్లు
మార్క్ బౌచర్ (సౌతాఫ్రికా)
ఈ జాబితాలో మొదటి స్థానంలో సౌతాఫ్రికాకు చెందిన దిగ్గజ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ ఉన్నారు. ఆయన తన అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్‌లలో కలిపి 467 మ్యాచ్‌లలో 998 మంది బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్ పంపారు. ఇందులో 952 క్యాచ్‌లు కాగా, 46 స్టంపింగ్‌లు ఉన్నాయి. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు.
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు చెందిన విధ్వంసకర బ్యాట్స్‌మెన్ కమ్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గిల్‌క్రిస్ట్ తన కెరీర్‌లో 396 మ్యాచ్‌లలో 905 మందిని అవుట్ చేశాడు. ఇందులో 813 క్యాచ్‌లు, 92 స్టంపింగ్‌లు ఉన్నాయి. బ్యాటింగ్‌లో కూడా ఆయన రికార్డులు అసాధారణమైనవి.
ఎంఎస్ ధోనీ (భారత్)
భారతదేశానికి చెందిన లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నారు. ధోనీ 538 మ్యాచ్‌లలో 829 మందిని అవుట్ చేశాడు. ఇందులో 634 క్యాచ్‌లు మరియు 195 స్టంపింగ్‌లు ఉన్నాయి. ముఖ్యంగా, అత్యధిక స్టంపింగ్‌లు చేసిన వికెట్ కీపర్‌గా ధోనీ ప్రపంచ రికార్డు సాధించారు. ఆయన మెరుపు వేగంతో చేసే స్టంపింగ్‌లు ఇప్పటికీ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోతాయి.
కుమార సంగక్కర (శ్రీలంక)
శ్రీలంకకు చెందిన గొప్ప వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నారు. సంగక్కర తన కెరీర్‌లో 594 మ్యాచ్‌లలో 678 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేశాడు. ఇందులో 539 క్యాచ్‌లు, 139 స్టంపింగ్‌లు ఉన్నాయి.
ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియాకు చెందిన మరో గొప్ప వికెట్ కీపర్ ఇయాన్ హీలీ ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. హీలీ తన కెరీర్‌లో 287 మ్యాచ్‌లలో 628 మందిని అవుట్ చేశాడు. ఇందులో 560 క్యాచ్‌లు, 68 స్టంపింగ్‌లు ఉన్నాయి.
ఈ ఐదుగురు దిగ్గజాలు తమ అద్భుతమైన నైపుణ్యాలతో వికెట్ కీపింగ్ స్థాయిని పెంచారు. బ్యాటింగ్‌లో కూడా వీరు తమ జట్లకు ఎన్నో విజయాలు అందించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..