
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ ఎందరో ఆటగాళ్లకు సరికొత్త గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలవగా, గుజరాత్ టైటాన్స్ పేసర్ కగిసో రబాడా అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. అయితే, ఈ మెగా టోర్నీలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కొందరు అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లు ఘోరంగా విఫలమవగా.. మరికొందరు విదేశీ దిగ్గజాలు మాత్రం తమ అసాధారణ ప్రదర్శనతో మైదానంలో పూనకాలు తెప్పించారు. తమ పవర్‌ఫుల్ బ్యాటింగ్, క్లాస్ బౌలింగ్‌తో ఐపీఎల్ 2026 సీజన్‌ను శాసించిన ఆ టాప్-5 ఓవర్సీస్ ప్లేయర్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దాం.
1. హెన్రిచ్ క్లాసెన్ – సన్‌రైజర్స్ హైదరాబాద్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ తరఫున పరుగుల వరద పారించారు. ఈ లీగ్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్.. ఏకంగా 160 స్ట్రైక్ రేట్‌తో 624 పరుగులు బాదారు. ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన ఆయన.. మొత్తం 6 హాఫ్ సెంచరీలు సాధించారు. క్లాసెన్ కెరీర్‌లోనే ఐపీఎల్ 2026 అత్యుత్తమ సీజన్‌గా నిలిచిపోవడం విశేషం.
2. జోఫ్రా ఆర్చర్ – రాజస్థాన్ రాయల్స్
గాయాల నుంచి కోలుకుని ఐపీఎల్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ (RR) స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ తన పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్ల గుండెల్లో వణుకు పుట్టించారు. టోర్నీలో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన ఆర్చర్.. 25 వికెట్లు పడగొట్టి ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు క్వాలిఫైయర్-2 వరకు దూసుకెళ్లడంలో ఆర్చర్ బౌలింగ్ కీలక పాత్ర పోషించింది.
3. కగిసో రబాడా – గుజరాత్ టైటాన్స్
గుజరాత్ టైటాన్స్ (GT) విజయాల్లో కీలక పాత్ర పోషించిన సౌతాఫ్రికా పేస్ గన్ కగిసో రబాడా ఈ సీజన్ పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచారు. టోర్నమెంట్‌లో అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసిన రబాడా.. 17 మ్యాచుల్లో ఏకంగా 29 వికెట్లు పడగొట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. రబాడా వేసిన నిప్పులు చెరిగే బంతుల వల్లే గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్ 2026 ఫైనల్స్ వరకు చేరగలిగింది.
4. కూపర్ కానోలీ – పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు కూపర్ కానోలీ తన మొదటి సీజన్‌లోనే అందరినీ ఆశ్చర్యపరిచారు. పంజాబ్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరనప్పటికీ.. కానోలీ మాత్రం మిడిలార్డర్‌లో నిలకడగా రాణించి 14 మ్యాచుల్లో 163 స్ట్రైక్ రేట్‌తో 491 పరుగులు చేశారు. ఈ క్రేజీ సీజన్‌లో ఆయన ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో అభిమానులను అలరించారు.
5. మిచెల్ మార్ష్ – లక్నో సూపర్ జెయింట్స్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టులోని మిగతా బ్యాటర్లు అంతగా రాణించకపోయినా.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ మాత్రం ఒంటరి పోరాటం చేశారు. లక్నో తరఫున ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించిన మార్ష్.. 13 మ్యాచుల్లో 163 మెరుపు స్ట్రైక్ రేట్‌తో 563 పరుగులు రాబట్టారు. ఈ టోర్నీలో లక్నో బ్యాటింగ్ భారమంతా మోసిన మార్ష్.. ఒక అద్భుతమైన సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు సాధించారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..