
Tamil Nadu Premier League 2026 Schedule: భారత క్రికెట్ అభిమానులకు మరో ధనాధన్ క్రికెట్ వినోదం అందుబాటులోకి వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీఎల్) 10వ సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మైదానంలో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించేందుకు ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి.
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్ ఆగస్టు 4 నుంచి షురూ అయింది. ఈ పదవ సీజన్‌లో మొత్తం 32 హోరాహోరీ పోరులు జరగనున్నాయి. లీగ్ పోటీలన్నీ డిండిగల్‌లోని ఎన్‌పీఆర్ కాలేజ్ గ్రౌండ్, చెన్నైలోని చారిత్రాత్మక ఎంఏ చిదంబరం స్టేడియం వేదికలుగా నిర్వహిస్తున్నారు.
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ట్రోఫీ కోసం తలాపడనున్నాయి. ఆగస్టు 28న జరిగే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌తో ఈ సమరం ముగుస్తుంది. ఐపీఎల్‌లో మెరిసిన వాషింగ్టన్ సుందర్, టి నటరాజన్, వరుణ్ చక్రవర్తి, సాయి కిషోర్, షారూఖ్ ఖాన్, ఎన్ జగదీసన్ వంటి ఐపీఎల్ స్టార్లతో పాటు బి ఇంద్రజిత్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకునేందుకు బరిలోకి దిగుతున్నారు.
ఐపీఎల్‌లో తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్న సాయి కిషోర్‌కు ఈ సీజన్‌లో ప్రత్యేక బాధ్యత లభించింది. ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళన్స్ జట్టుకు అతడు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అనుభవజ్ఞుడైన ఎన్ జగదీసన్ చేపాక్ సూపర్ గిల్లీస్ జట్టును నడిపిస్తుండగా, దిండిగల్ డ్రాగన్స్ బాధ్యతలను బాబా ఇంద్రజిత్ తీసుకున్నాడు.
మిగిలిన జట్లలో నెల్లై రాయల్ కింగ్స్ కెప్టెన్‌గా సోనూ యాదవ్, సేలం స్పార్టన్స్‌కు ఎస్ అభిషేక్, సీకెమ్ మధురై పాంథర్స్‌కు బాల్‌చందర్ అనిరుధ్, తిరుచ్చి గ్రాండ్ చోళాస్ జట్టుకు జయరామన్ కుమార్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యంగ్ కెప్టెన్లు, సీనియర్ ప్లేయర్ల వ్యూహాలతో ప్రతి మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది.
టోర్నీలో చేపాక్ సూపర్ గిల్లీస్, దిండిగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుప్పూర్ తమిళన్స్, మధురై పాంథర్స్, కోవై కింగ్స్, నెల్లై రాయల్ కింగ్స్, సేలం స్పార్టన్స్, తిరుచ్చి గ్రాండ్ చోళాస్ జట్లు తలాపడుతున్నాయి. ఆగస్టు 4 నుంచి 15 వరకు మొదటి విడత లీగ్ మ్యాచ్‌లు డిండిగల్‌లో జరుగుతాయి.
ఆ తర్వాత ఆగస్టు 18 నుంచి మ్యాచ్‌లు చెన్నైలోని చెపాక్ స్టేడియానికి మారుతాయి. లీగ్ దశ ముగిసిన తర్వాత ఆగస్టు 23న క్వాలిఫయర్ 1, 24న ఎలిమినేటర్, 26న క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయి. చివరగా ఆగస్టు 28న టైటిల్ విజేత ఎవరో తేలే ఫైనల్ సమరం జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..