
IND vs NZ : తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం సాక్షిగా టీమిండియా సిక్సర్ల సునామీ సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా యువ సంచలనం ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇద్దరూ పోటీపడి మరీ మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు.
మధ్యాహ్నం నుంచి తిరువనంతపురంలో వాతావరణం క్రికెట్ ఫీవర్‌తో నిండిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే చిన్న షాక్ తగిలింది. లోకల్ స్టార్ సంజు శాంసన్ (6) మరోసారి నిరాశపరచగా, అభిషేక్ శర్మ (30) మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ఈ జోడీ మూడో వికెట్‌కు కేవలం 46 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. ఇషాన్ 12వ ఓవర్‌లో కివీస్ స్టార్ స్పిన్నర్ ఈష్ సోధిని టార్గెట్ చేసి ఏకంగా 29 పరుగులు రాబట్టాడు. నాలుగు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో సోధిని ఊచకోత కోశాడు. ఇషాన్ కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో 360 డిగ్రీల షాట్లతో కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ మ్యాచులో చూపిన పర్ఫామెన్సుతో ఇషాన్ వరల్డ్ కప్ లో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు.
ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 82 పరుగులతో తన సెంచరీ దిశగా దూసుకెళ్తుండగా, సూర్యకుమార్ యాదవ్ 50 పరుగుల తర్వాత స్టంప్ అవుట్ అయ్యాడు. కివీస్ బౌలర్లు ఎన్ని మార్పులు చేసినా, ఈ ఇద్దరు బ్యాటర్లను అడ్డుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఇదే జోరు కొనసాగితే టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 250 పరుగుల మైలురాయిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత జట్టు ఇంతటి పటిష్టమైన ఫామ్‌లో ఉండటం అభిమానుల్లో జోష్ నింపుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..