
Dale Steyn : క్రికెట్ ప్రపంచానికి సచిన్ టెండూల్కర్, వివ్ రిచర్డ్స్, బ్రయాన్ లారా, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌లు వచ్చారు. అదే విధంగా కర్ట్లీ ఆంబ్రోస్, మాల్కమ్ మార్షల్, ముత్తయ్య మురళీధరన్ లాంటి గొప్ప బౌలర్‌లు కూడా వచ్చారు. వారిలో ఒకరు దక్షిణాఫ్రికాకు చెందిన డేల్ స్టెయిన్. డేల్ స్టెయిన్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఎక్కువ రోజులు నంబర్-1 బౌలర్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. అతని రికార్డు, కెరీర్, ఇతర వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
డేల్ స్టెయిన్, టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక సంచలనం. తన ఫాస్ట్‌నెస్, డేంజరస్ స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌లను భయపెట్టేవాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్టెయిన్, ఆ తర్వాత దశాబ్దం పాటు దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగానికి నాయకుడిగా వ్యవహరించాడు. అతని కెరీర్‌లో అత్యంత కీలకమైన ఘట్టం 2008లో మొదలైంది. ఆ ఏడాది స్టెయిన్ తొలిసారిగా ప్రపంచంలోనే నంబర్-1 టెస్ట్ బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత సుమారు ఆరు సంవత్సరాల పాటు, అంటే 2,343 రోజుల పాటు, ఆ స్థానాన్ని ఎవరికీ దక్కనివ్వలేదు. అత్యధిక కాలం నంబర్-1 బౌలర్‌గా కొనసాగిన రికార్డు ఇప్పటికీ స్టెయిన్ పేరు మీదే ఉంది. అతను 2008 నుంచి 2014 వరకు టెస్టుల్లో టాప్ బౌలర్‌గా కొనసాగాడు.
తన దాదాపు 15 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌లో స్టెయిన్ 93 మ్యాచ్‌లు ఆడి 439 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అతను ఇప్పటికీ కొనసాగుతున్నాడు. అతని తర్వాత స్థానంలో షాన్ పొలాక్ (421 వికెట్లు) ఉన్నాడు. స్టెయిన్ స్ట్రైక్ రేట్ కూడా చాలా అద్భుతమైనది. అతను ప్రతి 42.3 బంతులకు ఒక వికెట్ తీసేవాడు. 26 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, 5 సార్లు మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టాడు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక కాలం నంబర్-1 బౌలర్‌గా ఉన్న వారిలో స్టెయిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత వెస్టిండీస్ దిగ్గజం కర్ట్లీ ఆంబ్రోస్ ఉన్నాడు. ఆంబ్రోస్ తన కెరీర్‌లో 1,719 రోజుల పాటు టాప్ బౌలర్‌గా కొనసాగాడు. అతను 405 వికెట్లు తీశాడు. మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఉన్నాడు. మురళీధరన్ 1,711 రోజుల పాటు నంబర్-1 స్థానంలో ఉన్నాడు. స్టెయిన్ ప్రదర్శన ఈ దిగ్గజ బౌలర్లందరి కంటే చాలా గొప్పదని ఈ రికార్డులు చెబుతున్నాయి.
డేల్ స్టెయిన్ అంటే బ్యాట్స్‌మెన్‌లకు ఒక రకమైన భయం ఉండేది. దాని ప్రధాన కారణం అతని వేగం, స్వింగ్. అతని బంతులు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చేవి. అంతేకాకుండా, బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే అద్భుతమైన సామర్థ్యం అతనికి ఉంది. ముఖ్యంగా ఇన్-స్వింగ్ యార్కర్లు వేయడంలో స్టెయిన్ దిట్ట. ఫాస్ట్ బౌలింగ్‌లో ఒక కొత్త శకానికి స్టెయిన్ నాంది పలికాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..