
ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ టోర్నమెంట్ ‘TG20’కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరగనుంది. జూన్ 21 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా లీగ్‌పై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ జట్లు పాల్గొనే ఈ టోర్నీ 21 రోజుల పాటు సాగనుండగా, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా 32 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో నమోదైన 1,300 మందికి పైగా ఆటగాళ్లు ఈ వేలంలో పాల్గొంటున్నారు. భారత జట్టు స్టార్ క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు అంబటి రాయుడు, రోహిత్ రాయుడు, రాహుల్ బుద్ది, సి.వి. మిలింద్, తన్మయ్ అగర్వాల్, అండర్-19 ప్రపంచకప్ ఆటగాడు ఆరోన్ జార్జ్ కూడా వేలం జాబితాలో ఉన్నారు. ప్రముఖ ఆక్షనీర్ చారూ శర్మ ఈ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
ప్రతి ఫ్రాంచైజీకి రూ.60 లక్షల పర్స్ మనీ కేటాయించగా, కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి చేశారు. ఒక్కో జట్టు గరిష్టంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఐకాన్, A+, A, B, C1, C2 కేటగిరీలుగా ఆటగాళ్లను విభజించి పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నారు. TG20 లీగ్ ప్రత్యేకత గ్రామీణ ప్రతిభకు పెద్దపీట వేయడంలో ఉంది. ప్రతి జట్టులో కనీసం నలుగురు జిల్లా ఆటగాళ్లు ఉండాలని, అలాగే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఇద్దరు జిల్లా క్రికెటర్లు తప్పనిసరిగా ఆడాలని నిబంధన విధించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువ క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అరుదైన అవకాశం లభించనుంది. తెలంగాణ క్రికెట్ అభివృద్ధికి, కొత్త తరం ఆటగాళ్లను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు TG20 కీలక వేదికగా మారుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీగ్ విజయవంతమైతే రాష్ట్ర క్రికెట్‌కు కొత్త దిశను చూపే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి